Blind Cricket Asia Cup: ఆసియా కప్ ఫైనల్‌లో హైడ్రామా.. పాక్‌కు ట్రోఫీ, భారత్ బాయ్‌కాట్.!

Blind Cricket Asia Cup: ఆసియా కప్ ఫైనల్‌లో హైడ్రామా.. పాక్‌కు ట్రోఫీ, భారత్ బాయ్‌కాట్.!

ఢాకా: మెన్స్ బ్లైండ్ క్రికెట్ ఆసియా కప్ ఫైనల్‌లో తీవ్ర వివాదం చోటుచేసుకుంది. వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దయినప్పటికీ, మెరుగైన నెట్ రన్ రేట్ ఆధారంగా పాకిస్థాన్‌ను విజేతగా ప్రకటించడంపై భారత జట్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ టీమిండియా ప్రెజెంటేషన్ సెర్మనీని బహిష్కరించింది. అంతేకాకుండా, భవిష్యత్తులో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లను కూడా బహిష్కరిస్తామని హెచ్చరించింది.

పాక్‌కు ట్రోఫీ ఇవ్వడంపై భారత బోర్డు అభ్యంతరం

ఫైనల్ మ్యాచ్ నిర్వహించకుండానే పాకిస్థాన్‌కు ట్రోఫీ అందజేయడాన్ని భారత క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ (CABI) తీవ్రంగా తప్పుబట్టింది. టోర్నమెంట్ నిబంధనల ప్రకారం ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించాలని టెక్నికల్ కమిటీ నిర్ణయించినప్పటికీ, వరల్డ్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ (WBCC) అధ్యక్షుడు సుల్తాన్ షా ఆ నిర్ణయాన్ని పక్కనపెట్టారని భారత బోర్డు ఆరోపించింది. ఆయన ఆదేశాల మేరకే మ్యాచ్ రెఫరీ పాకిస్థాన్‌ను విజేతగా ప్రకటించారని  తెలిపింది. 

పాక్‌తో ఇకపై మ్యాచ్‌లు ఆడబోం

ఈ వివాదంపై CABI సెక్రటరీ శైలేంద్ర తీవ్రంగా స్పందించారు. సమస్య పరిష్కారమయ్యే వరకు పాకిస్థాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఆడబోమని స్పష్టం చేశారు. నెట్ రన్ రేట్ (NRR) అనేది కేవలం క్వాలిఫయింగ్ దశలో జట్ల స్థానాలను నిర్ణయించడానికి మాత్రమే ఉపయోగిస్తారని, ఫైనల్ విజేతను ప్రకటించడానికి దానిని ప్రాతిపదికగా తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు.

టోర్నమెంట్ ప్లేయింగ్ కండిషన్స్‌లోని క్లాజ్ 27ను నిర్వాహకులు తప్పుగా అన్వయించారని శైలేంద్ర ఆరోపించారు. సాధారణంగా క్రికెట్ టోర్నమెంట్లలో ఫైనల్ మ్యాచ్ కోసం రిజర్వ్ డే కేటాయిస్తారని, అలాంటి అవకాశం లేనప్పుడు మ్యాచ్ రద్దయితే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించడం సంప్రదాయమని  తెలిపారు.

ప్లేయింగ్ కండిషన్స్‌లో చేసిన మార్పుల గురించి కెప్టెన్ల సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదని భారత బోర్డు వెల్లడించింది. వర్షం పడుతున్న సమయంలో కూడా నిబంధనలపై చర్చించే అవకాశం ఉన్నప్పటికీ, నిర్వాహకులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించింది.

ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చే వరకు పాకిస్థాన్‌తో క్రికెట్ సంబంధాలను కొనసాగించే ప్రసక్తే లేదని CABI స్పష్టం చేసింది. దీంతో మెన్స్ బ్లైండ్ క్రికెట్ ఆసియా కప్ ఫైనల్ వివాదం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది