ఆధ్యాత్మికం : ఆత్మహత్యలను తగ్గించిన చాణుక్యుడి చట్టం.. ఇది చదివితే ఆత్మహత్య ఆలోచనే రాదు..

ఆధ్యాత్మికం : ఆత్మహత్యలను తగ్గించిన చాణుక్యుడి చట్టం.. ఇది చదివితే ఆత్మహత్య ఆలోచనే రాదు..

సాంబడు ఒక టెక్స్​ టైల్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు... రోజుకు పది గంటలు కష్టపడి పనిచేసినా అతని జీతం అంతంత మాత్రమే. ఇంట్లో ముగ్గురు పిల్లలు, భార్య, తన సంపాదన సరిపోయేది కాదు. రోజు రోజుకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి సాంబడికి, ఆలోచించి... ఆలోచించి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడినే నమ్ముకున్న కుటుంబసభ్యులు రోడ్డునపడ్డారు.

సుజాత బీటెక్ చదువుతోంది. తన సీనియర్ శ్రీకాంత్​ ను  ప్రేమించింది. ఇద్దరూ కలిసి సినిమాలకు, పార్క్ కు తిరిగారు. కానీ, కొన్ని కారణాల వల్ల శ్రీకాంత్ ఆమెను పెండ్లి చేసుకునేందుకు ఒప్పుకోలేదు. దాంతో డిప్రెషన్​ లోకి వెళ్లిన సుజాత నా జీవితం ఇంతే. నేను ఇష్టపడిన వాళ్లెవరూ నాకు దక్కరు. నాకి ఎందుకు ఇలా జరుగుతుంది' అని మనోవేదనకు గురైంది. తల్లిదండ్రులు ఇంట్లో లేని టైంలో స్లీపింగ్ పిల్స్ మింగింది. దాంతో ఊళ్లో వాళ్లు సుజాత గురించి పది రకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. సుజాత తల్లిదండ్రులు కూతురు మీద దిగులుతో, ఊళ్లో వాళ్ల సూటిపోటి మాటలు తట్టుకోలేక మంచాన పడ్డారు.

తాళంకప్ప తయారుచేసినవాడు, తాళంచెవి కూడా తయారుచేస్తాడు. అలాగే మనకు వచ్చే కష్టాలు, ఇబ్బందులకు కచ్చితంగా ఒక సొల్యూషన్ ఉంటుంది. ఎదురయ్యే ప్రతి కష్టాన్ని ఆలోచించి పరిష్కరించుకోవాలి. అంతేకాని ఆత్మహత్య పరిష్కారం కాదనే విషయం గుర్తుంచుకోవాలి. 'ఈ లైఫ్ వేస్ట్, బతికి ఏం సాధించాలి" అనే ఆలోచనలు పక్కన పెట్టాలి. ఎంత పెద్ద సమస్యకైనా చావు పరిష్కారం కాదు. "మన దేహం చాలా గొప్పది.. దాన్ని నాశనం చేయడం అవివేకం" అంటాడు చాణక్యుడు. 

ఒక రోజు చంద్రగుప్తుడి దగ్గరకు ఒక భటుడు వచ్చి 'ప్రభూ! రాజ్యంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి' అని చెబుతాడు. వెంటనే చంద్రగుప్తుడు దానికి పరిష్కారం తెలుసుకునేందుకు సమావేశం ఏర్పాటు చేస్తాడు. ఆ సమావేశానికి చాణక్యుడిని కూడా రమ్మని కబురు పంపుతాడు. ఆ సమావేశానికి వచ్చిన చాణక్యుడు అసలు ఆత్మహత్యలకు కారణాలేంటి?' అని ప్రశ్నిస్తాడు.
'ఆర్థిక ఇబ్బందులు ఎదిగే అవకాశం లేకపోవడం వంటివి కారణాల'ని మంత్రులు చెబుతారు. దానికి చాణక్యుడు... 'దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి. ఆర్థిక శాస్త్ర నిపుణులతో చర్చించి ప్రజల జీవన మార్గాన్ని మెరుగుపరచాలి.

అప్పుడే ప్రజలను ఆర్థికంగా బలపరచగలం. కానీ, ఈ ఆత్మహత్యలకు ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా?' అని అడుగుతాడు. దానికి చంద్రగుప్తుడు 'మరేమీ లేవు' అంటాడు. దానికి చాణక్యుడు వెంటనే... ఉన్నాయి. నేను ఆలోచించేది. నిజమైతే... అవి నీ వరకు రావు. ..నా అంచనా సరైంది అయితే జీవితంపై విరక్తి చెందడం. గెలుపుకోసం ప్రయత్నాలు చేసి విఫలమై అలసిపోవడం.. నిరాశ చెందడం. 

దానికి తన జీవితంలోని కొంతమందే కారణం అనేటువంటివి కూడా ఆత్మహత్యకు ప్రేరేపిస్తాయి. ఈ ఆత్మహత్యలను నివారించాలంటే ఒక మార్గం ఉంది. ఆత్మహత్య చేసుకుని చనిపోయే వాళ్లకి సంప్రదాయం ప్రకారం చేసే శ్రాద్ధ ఖర్మలు చేయబోరని ఒక చట్టం తేవాలి" అని చెబుతాడు. దానికి మంత్రులెవ్వరూ ఒప్పుకోరు. 'సంప్రదాయాలకు విరుద్ధంగా ఎలా వెళ్తాం' అంటారు. "శాస్త్రాల ప్రకారం ఆత్మహత్య చేసుకోవడం కూడా తప్పే. అలా చేసిన వారు సంస్కారాన్ని గౌరవించని వారవుతారు. 

పుట్టిన ప్రతి మనిషి తాను చేసే ఖర్మల ద్వారా చనిపోయిన తర్వాత పరమాత్మలో కలిసిపోతారు. అలాంటి ఆలోచనలకు మన దేహం సాధనం లాంటిది. అలాంటి సాధనాన్ని ఎలా నాశనం చేసుకుంటారు?" అని ప్రశ్నిస్తాడు. అయినా మంత్రులు అందుకు ఒప్పుకోకపోవడంతో వాళ్లందరితో మాట్లాడి.. ఒప్పిస్తాడు చాణక్యుడు. ఈ చట్టాన్ని ఒక నెల అమలు చేసి చూద్దాం అంటాడు.

నెల తర్వాత అందరూ మళ్లీ సమావేశం అవుతారు. ఒక మంత్రి లేచి "మీరు చెప్పినట్లుగానే రాజ్యంలో ఆత్మహత్యలు తగ్గిపోయాయి. చావుకు భయపడని మనిషి... చచ్చాక తన శరీరాన్ని ఏం చేస్తారో అని భయపడుతున్నాడు" అంటాడు. దానికి చాణక్యుడు "కొన్నిసార్లు మనిషికి బతుకుపై ఆశ కలిగించాలంటే.. సమస్యలకు పరిష్కారం చావు కాదని అర్థమయ్యేటట్టు చెప్పాలి. అది చిన్న కారణమైనా దాన్ని లెక్కలోకి తీసుకోవాలి" అన్నాడు.

సమస్యలను చూసి, వాటినే తలచుకుని పారిపోవడం సరైంది కాదు. కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవాలి. అంతేకాని ఆత్మహత్యే పరిష్కారం అనుకోకూడదు. బాధ్యత లేని వ్యక్తులే అలా ఆలోచిస్తారు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మీ కోసం ఎదురుచూస్తున్న వాళ్ల గురించి ఆలోచించాలి. 

ఎవరికైనా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తే... బతుకుపై ఆశ కలిగించే ఒక్క విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ప్రేమ విఫలమైందా...? మనకంటూ ప్రేమను పంచేవారు. ఎవరో ఒకరు పుట్టే ఉంటారని గుర్తుచేసుకోవాలి. ఎన్ని గొడవలైనా, ఎన్ని మాటలన్నా ఇంట్లో అన్నం పళ్లెంతో అమ్మ ఎదురు చూస్తుందనే విషయం గుర్తుకురావాలి. అప్పటివరకు అనుభవించిన జీవితం అందులోని అనుభూతులు గుర్తు చేసుకుంటే ఆత్మహత్య చేసుకునేందుకు కళ్ల ముందు ఉన్న కారణం చాలా చిన్నదిగా కనిపిస్తుంది.