ఆర్మీ వాహనానికి ట్రాఫిక్ చలాన్..! మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ పై వేటు..!

ఆర్మీ వాహనానికి ట్రాఫిక్ చలాన్..! మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ పై వేటు..!

అస్సాంలోని జోర్హాట్‌లో ఆర్మీ వాహనాన్ని తనిఖీ చేసిన ఘటన వివాదానికి దారి తీసింది. ఆర్మీ డ్రైవర్‌కు చలాన్ విధించడంతో పాటు, విధుల్లో అనుచితంగా ప్రవర్తించిన మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సమీమ్ సుల్తానాను ప్రభుత్వం విధులకు దూరం చేసింది. రక్షణ శాఖ వాహనాల తనిఖీలు, లైసెన్స్ నిబంధనలపై జోర్హాట్ డీటీఓ ధనంజయ్ సైకియా క్లారిటీ ఇచ్చారు.

నవంబర్ 18న జోర్హాట్ ఐఎస్‌బీటీ సమీపంలో రవాణా శాఖ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో లిచుబారి మిలిటరీ స్టేషన్‌కు చెందిన ఆర్మీ జిప్సీని నిలిపివేశారు. ఆ సమయంలో వాహనంలో ఉన్న డ్రైవర్, మరో సైనిక సిబ్బందిని లైసెన్స్, సీట్ బెల్ట్ గురించి ఎంవీఐ ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆర్మీ సిబ్బంది పట్ల ఎంవీఐ వ్యవహరించిన తీరుపై చర్చ మొదలైంది.

ఈ ఘటనపై డీటీఓ ధనంజయ్ సైకియా వివరణ ఇస్తూ.. ఆర్మీ డ్రైవర్‌ వద్ద సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు చలాన్ వేయలేదని, సీట్ బెల్ట్ పెట్టుకోనందుకే జరిమానా విధించామని తెలిపారు. ఆర్మీ సిబ్బంది తమ అధికారిక వాహనాలను నడపడానికి రక్షణ శాఖ జారీ చేసిన లైసెన్స్‌లు దేశవ్యాప్తంగా చెల్లుతాయని ఆయన ధృవీకరించారు.

చట్టం ఏం చెబుతోంది..?

మోటార్ వాహనాల చట్టం 1988, సెక్షన్ 18 ప్రకారం.. రక్షణ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసే డ్రైవింగ్ లైసెన్స్‌లు దేశమంతటా చెల్లుబాటు అవుతాయి. ఆర్మీ వాహనాలు నడిపేందుకు డ్రైవర్లకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే సివిల్ లైసెన్స్ అవసరం లేదు. అయితే, ఈ రక్షణ శాఖ లైసెన్స్ కేవలం అధికారిక మిలిటరీ వాహనాలకు మాత్రమే పరిమితం. ప్రైవేట్ కార్లు లేదా ఇతర వాహనాలు నడపడానికి సాధారణ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.

లైసెన్స్ విషయంలో మినహాయింపు ఉన్నప్పటికీ, ట్రాఫిక్ నిబంధనల నుంచి రక్షణ వాహనాలకు పూర్తి మినహాయింపు ఉండదని డీటీఓ స్పష్టం చేశారు. మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 194B ప్రకారం, సీట్ బెల్ట్ ధరించకపోతే రూ. వెయ్యి జరిమానా విధిస్తారు. ఈ నిబంధన అందరికీ వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఎంవీఐపై చర్యలు:

తనిఖీ సమయంలో ఎంవీఐ సమీమ్ సుల్తానా ప్రవర్తన సరిగా లేదని, ఆమె చేసిన వ్యాఖ్యలు అనవసర గందరగోళానికి దారితీశాయని డీటీఓ అంగీకరించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆర్మీ సిబ్బంది పట్ల అసహనంగా వ్యవహరించడంపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఆమెను ప్రస్తుతానికి విధులకు దూరం చేశామని, పూర్తిస్థాయి విచారణ తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు.

కాజీరంగా సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం నేపథ్యంలో అస్సాం ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే జోర్హాట్‌లో చేపట్టిన తనిఖీల్లో ఒక్కరోజే 189 ఉల్లంఘన కేసులు నమోదు చేసి, 16 వాహనాలను సీజ్ చేశారు. సైనిక బలగాలకు, జిల్లా యంత్రాంగానికి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని, ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని డీటీఓ కోరారు.