హైదరాబాద్‌లోని సూరారం, సాయిబాబా నగర్ వార్డుల ప్రజలకు జలమండలి కీలక సూచన చేసింది. ఈ రెండు వార్డుల పరిధిలో 24 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. సీవరేజ్ పైప్‌లైన్ నిర్మాణ పనుల్లో భాగంగా తాగునీటి పైప్‌లైన్‌ను మారుస్తుండటంతో నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు.
సూరారం చెరువు నుంచి శివాలయ నగర్‌లోని 14 ఎంఎల్డీ ఎస్టీపీ వరకు చేపట్టిన సీవరేజ్ పైప్‌లైన్ నిర్మాణ పనులు ఇప్పటికే 95 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులను పూర్తి చేసేందుకు 700 ఎంఎం డయామీటర్ కలిగిన తాగునీటి పైప్‌లైన్‌ను మార్చాల్సి ఉంది. ఇందులో భాగంగా సూరారం ప్రధాన రహదారిపై మల్లారెడ్డి ఆసుపత్రి ఎదురుగా పైప్‌లైన్ మార్పిడి పనులు చేపట్టనున్నారు.
ఈ పనులు నవంబర్ 21వ తేదీ రాత్రి 9 గంటల నుంచి నవంబర్ 22వ తేదీ రాత్రి 9 గంటల వరకు కొనసాగనున్నాయి. దీంతో మొత్తం 24 గంటల పాటు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.
సూరారం వార్డులోని విశ్వకర్మ కాలనీ, వైష్ణవి నగర్, వేమారెడ్డి నగర్, లక్ష్మీనగర్, సూరారం గ్రామంలో నీటి సరఫరాపై ప్రభావం పడనుంది. అలాగే సాయిబాబా నగర్ వార్డులోని తెలుగు తల్లి నగర్, జై భీమ్ నగర్, మైత్రి నగర్, సూరారం కాలనీ ప్రాంతాల్లోనూ నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది.
కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నీటి సరఫరా నిలిచిపోనుండగా, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా అంతరాయం ఉండనుంది. ఈ నేపథ్యంలో ప్రజలు ముందుగానే అవసరమైన నీటిని నిల్వ చేసుకోవాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి సూచించింది.
