Winter season: వారానికి రెండు సార్లు ఈ సూప్ తాగండి..గొంతునొప్పి.. జ్వరం మటుమాయం..!

Winter season: వారానికి రెండు సార్లు ఈ సూప్ తాగండి..గొంతునొప్పి.. జ్వరం మటుమాయం..!

చలికాలంలో గరంగరంగా ఏది తిన్నా మజానే, ఇక సూప్స్ తాగితే ఆహా.. ఆ హాయి మాటల్లో చెప్పలేం. వేడివేడిగా గొంతు నుంచి జారుతుంటే ఇంకా..ఇంకా తాగాలనిపిస్తుంది. ఈ సీజన్​ లో  కామన్​గా వచ్చే గొంతునొప్పి, జ్వరం రాకుండా ఉండాలంటే.. వారానికి రెండు సార్లు  ఇంట్లోనే హాట్ హాట్ సూప్స్ తయారుచేసుకోవాలి.

పొటాటో సూప్​ తయారీకి కావలసినవి

  • ఆలుగడ్డలు(ఉడికించి) - రెండు 
  • ఉల్లిగడ్డ తరుగు - పావు కప్పు
  •  పచ్చిమిర్చి తరుగు - పావు టీస్పూన్
  • మిరియాలపొడి- పావు టీ స్పూన్ 
  • కార్న్ పౌడర్ - ఒక టేబుల్ స్పూన్ 
  • ఉప్పు, నూనె - సరిపడా

తయారీ విధానం

ఆలుగడ్డలను చిన్న ముక్కలుగా తరగాలి. పాన్ లో నూనె వేడి చేసి అలుగడ్డ ముక్కల్ని రెండు నిమిషాలు వేగించి ప్లేట్​ లోకి తీయాలి. అదే పాన్ లో మరికొంచెం నూనె వేసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి వేగించాలి. ఉల్లిగడ్డ వేగాక రెండు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు అలుగడ్డ ముక్కలు, మిరియాల పొడి, కార్న్ పౌడర్ వేసి రెండు నిమిషాలు మరిగించాలి. చివర్లో కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకుంటే గరంగరం పొటాటో సూప్ రెడీ.

పెప్పర్ సూప్ తయారీకి  కావాల్సినవి

  • మిరియాల పొడి - ఒకటిన్నర టేబుల్ స్పూన్​
  • కార్న్ పౌడర్ - రెండు టేబుల్ స్పూన్లు
  • ఉల్లిగడ్డ తరుగు - పావు కప్పు 
  • పసుపు - పావు టీ స్పూన్ 
  • నూనె, ఉప్పు - సరిపడా.

తయారీ విధానం

నూనె వేడి చేసి ఉల్లిగడ్డ తరుగు, పసుపు వేసి వేగించాలి. రెండు కప్పుల నీళ్లుపోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు కార్న్ పౌడర్, మిరియాల పొడి, ఉప్పు వేసి మరికాసేపు మరిగించాలి. సూప్ చిక్కగా అయ్యాక కొత్తిమీర, పుదీనా తరుగు వేసి గార్నిష్ చేయాలి.

బేబీ కార్న్ సూప్ తయారీకి కావాల్సినవి

 

  • బేబీ కార్న్ (చిన్న ముక్కలుగా తరిగి)-ఒక కప్పు
  • అల్లం తరుగు - ఒక టేబుల్ స్పూన్
  •  వెల్లుల్లి రెబ్బలు-రెండు
  • పచ్చిమిర్చి తరుగు - అర టేబుల్ స్పూన్
  •  మిరియాల పొడి- అర టేబుల్ స్పూన్
  •  కార్న్ పౌడర్ - ఒక టేబుల్ స్పూన్
  •  సోయా సాస్ - ఒక టేబుల్ స్పూన్
  • మొక్కజొన్న పిండి- నాలుగు టేబుల్ స్పూన్లు
  • ఉప్పు, నూనె - సరిపడా

బేబీ కార్న్ సూప్ తయారీ విధానం


పాన్​ లో  నూనె వేడిచేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేగించాలి. కార్న్ ముక్కలు, ఉప్పు వేసి మరికొంత సేపు వేగించాలి. వాటిలో సోయాసాస్, మిరియాల పొడి వేసి రెండు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్న టైంలో మంటను తగ్గించి కొంచెం నీళ్లల్లో కలుపుకున్న కార్న్ పౌడర్ వేయాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి బేబీ కార్న్ సూప్ రెడీ.