స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీపై ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(IRDAI) భారీ జరిమానా విధించింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు కంపెనీకి మొత్తం రూ.2 కోట్ల పెనాల్టీ వేసింది. 2022లో నిర్వహించిన తనిఖీల ఆధారంగా ఐఆర్డీఏఐ ఈ ఆదేశాలు జారీ చేసింది.
2022 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 మధ్య స్టార్ హెల్త్ కార్యాలయాల్లో ఐఆర్డీఏఐ తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో వెల్లడైన అంశాల ఆధారంగా కంపెనీపై చర్యలు తీసుకున్నారు. మొత్తం 8 అభియోగాలపై విచారణ జరపగా.. అందులో నాలుగు అంశాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు రెగ్యులేటర్ గుర్తించింది.
ముఖ్యంగా కోవిడ్ క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్‌లో కంపెనీ సొంత పాలసీ నిబంధనలను అనుసరించలేదని ఐఆర్డీఏఐ పేర్కొంది. హెల్త్ ఇన్సూరెన్స్ రెగ్యులేషన్స్-2016లోని నిబంధనలను, కోవిడ్ క్లెయిమ్‌లపై ఐఆర్డీఏఐ జారీ చేసిన సర్క్యులర్లను ఉల్లంఘించినందుకు గాను కంపెనీకి రూ.కోటి జరిమానా విధించారు. పాలసీ డాక్యుమెంట్లలో పేర్కొన్న విధంగానే సేవలు అందించాలని, సరైన కారణం లేకుండా క్లెయిమ్ మొత్తంలో కోతలు విధించకూడదని ఐఆర్డీఏఐ స్పష్టం చేసింది.
మరో రూ.కోటి జరిమానాను ఇతర ఉల్లంఘనల కోసం విధించారు. క్లెయిమ్‌లను తిరస్కరించినప్పుడు దానికి గల స్పష్టమైన కారణాలను, ఏ నిబంధనల ప్రకారం తిరస్కరించారో పాలసీదారులకు సమాచారం ఇవ్వడంలో కంపెనీ విఫలమైందని రెగ్యులేటర్ గుర్తించింది. అలాగే క్లెయిమ్ సెటిల్‌మెంట్ సమయంలో ఏకపక్షంగా డబ్బులు తగ్గించడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ఇన్సూరెన్స్ రెగ్యులేషన్స్ 27(v), 33(d)తో పాటు టీపీఏ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని ఉత్తర్వుల్లో వివరించింది ఇన్సూరెన్స్ రెగ్యులేటర్.
మిగిలిన 4 అభియోగాలకు సంబంధించి కంపెనీకి హెచ్చరికలు, సలహాలు జారీ చేసినట్లు రెగ్యులేటర్ తెలిపింది. పాలసీదారులకు సేవలు అందించే క్రమంలో పారదర్శకత పాటించాలని, ఎటువంటి వివరణ లేకుండా క్లెయిమ్‌లను తిరస్కరించవద్దని స్టార్ హెల్త్‌ను ఆదేశించింది. రూల్స్ ప్రకారమే బిజినెస్ చేయాలని హెచ్చరించింది రెగ్యులేటరీ సంస్థ.
