ఈ ఏడాది 2026 చివరి నెల అయిన డిసెంబర్లో భారత ఆటోమొబైల్ మార్కెట్లో కొత్త సందడి రానుంది. ఈ నెలలో ప్రముఖ కార్ల తయారీ సంస్థలు నాలుగు కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి తీసుకురానున్నాయి. ఇందులో రెండు కొత్త ఎలక్ట్రిక్ SUVలు, ఒక ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV, ఒక పెట్రోల్ సెడాన్ ఉన్నాయి.
ఈ ఏడాది ఇప్పటికే థర్డ్ జనరేషన్ రెనాల్ట్ డస్టర్, నిస్సాన్ టెక్టన్, మారుతి ఇ-విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా, సెకండ్ జనరేషన్ హ్యుందాయ్ బేయాన్ వంటి మోడళ్లు ఆటోమొబైల్ రంగంలో ఆసక్తిని పెంచాయి. ఇప్పుడు సంవత్సరం ముగిసేలోపు మరో నాలుగు కొత్త కార్లు మార్కెట్లోకి రానుండటంతో కారు ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. మరి డిసెంబర్లో విడుదల కానున్న ఆ నాలుగు కార్లు ఏవి ? వాటి ఫీచర్స్ ఏంటి ? ఒక్కొక్కటిగా తెలుసుకుందాం...
1. హోండా ఆల్ఫా (Honda Alpha)
హోండా కంపెనీ భారత మార్కెట్లోకి తీసుకురానున్న తొలి ఎలక్ట్రిక్ కారు హోండా ఆల్ఫా. 2025 జపాన్ మొబిలిటీ షోలో హోండా α (Alpha) కాన్సెప్ట్ పేరుతో ఈ కారును తొలిసారి పరిచయం చేశారు. ఇప్పుడు దీనిని భారత మార్కెట్లోకి తీసుకురావడానికి కంపెనీ సిద్ధమైంది. డిసెంబర్ 2న ఈ కారును లాంచ్ చేయనుంది.
డిజైన్ విషయానికి వస్తే, హోండా ఆల్ఫా చాలా కొత్తగా, భవిష్యత్తులో వచ్చే కార్ల తరహాలో కనిపించనుంది. ముఖ్యంగా దీని ఏరోడైనమిక్ డిజైన్ కారు ఆకర్షణను మరింత పెంచుతుంది. అంటే గాలి నిరోధం తక్కువగా ఉండేలా కారు ఆకారాన్ని రూపొందించారు. దీనివల్ల కారు పర్ఫార్మెన్స్, ప్రయాణ సామర్థ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది.
బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ SUV రెండు రకాల LFP బ్యాటరీ ఆప్షన్లతో వచ్చే అవకాశం ఉంది. అయితే, వాటి బ్యాటరీ సామర్థ్యం ఎంత అనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇందులో ఒక బ్యాటరీ ఆప్షన్‌తో ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చని అంచనా.
భారత మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఈ కారు టాటా సియెర్రా EV, మారుతి ఇ-విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా, మహీంద్రా BE 6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ వంటి మోడళ్లకు పోటీ ఇవ్వనుంది.
2. JSW కాంబ్యాట్ (JSW Combat)
డిసెంబర్ నెలలో మరో కొత్త కారు JSW మోటార్స్ నుంచి రానుంది. JSW గ్రూప్‌కు చెందిన ఆటోమొబైల్ విభాగం JSW మోటార్స్ తొలి కారును డిసెంబర్ 3న పరిచయం చేయనుంది. ఈ కారు పేరు JSW కాంబ్యాట్.
ఈ కారు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, చైనాకు చెందిన చెరీ గ్రూప్ రూపొందించిన జెటూర్ T2 SUV ఆధారంగా తయారవుతోంది. అంటే ఇప్పటికే ఉన్న జెటూర్ T2 మోడల్‌ను కొన్ని మార్పులు చేసి JSW బ్రాండ్ పేరుతో భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు.
ఈ కార్ D-సెగ్మెంట్‌కు చెందిన SUV. ఇందులో మోనోకోక్ నిర్మాణాన్ని ఉపయోగించారు. సాధారణంగా చెప్పాలంటే, కారు బాడీ, ఛాసిస్ రెండూ కలిపి ఒకే నిర్మాణంలా తయారుచేసే విధానాన్ని మోనోకోక్ అంటారు. దీనివల్ల కారు బరువు, డ్రైవింగ్ సౌకర్యం వంటి అంశాల్లో ప్రయోజనాలు ఉంటాయి.
ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. దీనికి రెండు ఎలక్ట్రిక్ మోటార్లను కూడా ఇవ్వనున్నారు. ఈ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్లు కలిసి పనిచేసే విధానాన్ని ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీ అంటారు.
ఈ టెక్నాలజీ ప్రత్యేకత ఏమిటంటే, పెట్రోల్ ఇంజిన్‌తో పాటు బ్యాటరీలో స్టోర్ చేసిన ఛార్జ్ సాయంతో కూడా కారును నడపవచ్చు. అవసరమైనప్పుడు బయట నుంచి కూడా బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు.
ఈ కారు పూర్తిగా ఛార్జింగ్ తో మాత్రమే 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే అవకాశం ఉందని అంచనా. అయితే, టెక్నాలజీ వివరాలు, ధర వంటివి కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
3. కొత్త వోక్స్వ్యాగన్ వర్టస్ (New Volkswagen Virtus)
వోక్స్వ్యాగన్ కంపెనీ ప్రముఖ సెడాన్ వర్టస్‌కు కొత్త రూపాన్ని తీసుకురానుంది. ఈ కారు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను డిసెంబర్ 11న భారత మార్కెట్లో విడుదల చేయనుంది.
ఫేస్‌లిఫ్ట్ అంటే పూర్తిగా కొత్త కారును తయారు చేయడం కాకుండా, ప్రస్తుతం ఉన్న మోడల్‌కు డిజైన్, ఫీచర్లు, టెక్నాలజీ పరంగా కొన్ని మార్పులు చేసి కొత్త వెర్షన్‌గా తీసుకురావడం.
కొత్త వర్టస్‌లో బయటివైపు కొన్ని డిజైన్ మార్పులు కనిపించనున్నాయి. ముఖ్యంగా ముందు, వెనుక బంపర్లను కాస్త మార్చనున్నారు. LED ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, కొత్త డిజైన్‌తో కూడిన 16 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను అందించనున్నారు.
కారు లోపల కూడా కొన్ని మార్పులు ఉండనున్నాయి. ఇందులో 12.3 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించే అవకాశం ఉంది. దీని ద్వారా డ్రైవర్‌కు స్పీడ్, ఫ్యూయల్ సమాచారం వంటి వివరాలు డిజిటల్ రూపంలో కనిపిస్తాయి. అలాగే 360 డిగ్రీల కెమెరా సిస్టమ్ కూడా ఉండొచ్చు. దీని వల్ల కారును పార్కింగ్ చేసే సమయంలో చుట్టూ ఉన్నవి స్క్రీన్‌పై చూసుకోవచ్చు.
మరో ముఖ్యమైన అప్‌గ్రేడ్ ఏసీ వ్యవస్థలో ఉండనుంది. మెరుగైన కూలింగ్ కోసం వేరియబుల్ జియోమెట్రీ కంప్రెసర్‌ను అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా వేసవి కాలంలో కారు క్యాబిన్ త్వరగా చల్లబడటానికి ఇది ఉపయోగపడుతుంది.
గేర్‌బాక్స్ విషయంలో కూడా మార్పు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న మోడల్లోని 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్థానంలో కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను తీసుకురావచ్చని సమాచారం. దీనివల్ల డ్రైవింగ్ మరింత సౌకర్యవంతంగా ఉండటంతో పాటు, ఇంధన సామర్థ్యం కూడా మెరుగుపడే అవకాశం ఉంది. మొత్తంగా కొత్త వర్టస్‌లో డిజైన్ మార్పులతో పాటు, టెక్నాలజీ, సౌకర్యాల పరంగా కూడా అప్గ్రేడ్లు ఉండనున్నాయి.
4. హ్యుందాయ్ ఐయోనిక్ P (Hyundai Ioniq P)
డిసెంబర్లో రానున్న మరో ముఖ్యమైన ఎలక్ట్రిక్ SUV హ్యుందాయ్ ఐయోనిక్ P. ఇప్పటివరకు ఈ కారును HE1i అనే కోడ్‌నేమ్‌తో పిలుస్తున్నారు. ఇది భారత మార్కెట్లోకి రానున్న కొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVగా నిలవనుంది.
డిజైన్ పరంగా ఈ కారును కొంచెం కొత్తగా రూపొందిస్తున్నారు. సాధారణ SUVలతో పోలిస్తే బాక్సీ ఆకారంలో ఉండే డిజైన్, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, ఎత్తుగా ఉండే రూఫ్ రైల్స్ దీని ప్రత్యేకతలు. అంటే రోడ్డు గుంతలు, ఎత్తుపల్లాలు ఉన్నప్పుడు కారు కింద భాగం రోడ్డుకు తగిలే అవకాశం తగ్గేలా దీని గ్రౌండ్ క్లియరెన్స్‌ను రూపొందించనున్నారు.
ఇక బయటివైపు చూస్తే, డోర్ హ్యాండిల్స్ కారులో కలిసిపోయినట్లుగా ఉండే డిజైన్‌ను అందించనున్నారు. ముందు, వెనుక లైట్లలో పిక్సెల్ గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. మొత్తంగా ఈ కారు చూడటానికి ఆధునికంగా, కొంచెం రగ్గడ్ SUV తరహాలో కనిపించనుంది.
ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో కొత్త డిజైన్‌తో క్యాబిన్ అందించనున్నారు. డ్రైవర్ కోసం 9.9 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వినోదం ఇంకా ఇతర సమాచారాన్ని అందించే 12.9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉండనున్నాయి.
బ్యాటరీ విషయంలో హ్యుందాయ్ రెండు వేరియంట్లను అందించే అవకాశం ఉంది. ఈ రెండు వేరియంట్లలో వేర్వేరు సామర్థ్యాలతో LFP బ్యాటరీ ప్యాక్‌లు ఉండనున్నాయి. వీటిలో పెద్ద బ్యాటరీ ఆప్షన్ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే అవకాశం ఉందని అంచనా.
భారత మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఈ ఎలక్ట్రిక్ SUV టాటా నెక్సాన్ EV, కియా సైరోస్ EV, మహీంద్రా XUV 3XO EV వంటి మోడళ్లకు పోటీ ఇవ్వనుంది.
డిసెంబర్లో రానున్న ఈ నాలుగు కార్లలో ప్రత్యేకత ఏంటి ?
ఈ డిసెంబర్లో విడుదల కానున్న నాలుగు కార్లను పరిశీలిస్తే, ఎలక్ట్రిక్ వాహనాలకు కంపెనీలు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయో అర్థమవుతుంది. హోండా ఆల్ఫా, హ్యుందాయ్ ఐయోనిక్ P పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ SUVలుగా రానుండగా, JSW కాంబ్యాట్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్లను ఉపయోగించే ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUVగా రానుంది. మరోవైపు వోక్స్వ్యాగన్ వర్టస్ పెట్రోల్ సెడాన్ విభాగంలో కొత్త అప్డేట్లతో మార్కెట్లోకి రానుంది.
ముఖ్యంగా ఎక్కువ రేంజ్ ఉన్న ఎలక్ట్రిక్ కార్ల కోసం ఎదురుచూస్తున్న వారికి హోండా ఆల్ఫా, హ్యుందాయ్ ఐయోనిక్ P మంచి అప్షన్ గా అవకాశం ఉంది. హైబ్రిడ్ SUV కావాలనుకునే వారికి JSW కాంబ్యాట్ ప్రత్యేకంగా ఉండవచ్చు. ఇక సెడాన్‌ను ఇష్టపడేవారికి కొత్త వోక్స్వ్యాగన్ వర్టస్ మంచి అప్డేట్లతో రానుంది. అయితే ఈ కార్ల ధరలు, పూర్తి ఫీచర్లు, వేరియంట్లు, బ్యాటరీ వివరాలు వంటి అంశాలపై కంపెనీల నుంచి మరిన్ని వివరాలు రావాల్సి ఉంది.
