కరీంనగర్ జిల్లాలో రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన పంచాయతీ కార్యదర్శి !

కరీంనగర్ జిల్లాలో రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన పంచాయతీ కార్యదర్శి !

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో పంచాయతీ కార్యదర్శి ఏసీబీ వలకు చిక్కాడు. మానకొండూరు మండలం లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి లావుడ్య చవాన్ లాల్‌ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడి కోడలికి 'టీ.జీ. చేయూత వితంతు పింఛన్' మంజూరు చేయించినందుకు పంచాయతీ కార్యదర్శి రూ.10 వేల లంచం డిమాండ్ చేశాడు. ఫిర్యాదుదారుడి ఇంటి దగ్గర లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.

నిందితుడి వద్ద నుంచి రూ.10 వేల లంచం సొమ్మును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఏసీబీ గుర్తించింది. నిందితుడిని అరెస్ట్ చేసి కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో అధికారులు హాజరుపరచనున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ వెల్లడించింది. లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు.