Mohammed Siraj Row: వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తుది జట్టు నుంచి పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ను తప్పించడంపై రాజకీయ దుమారం కొనసాగుతున్న వేళ, భారత మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ (Atul Wassan) ఘాటుగా స్పందించారు. సిరాజ్ పేరు, మతం కారణంగానే అతడికి చోటు దక్కలేదని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ చేసిన ఆరోపణలను ఖండించారు. క్రీడల్లో మతాన్ని లాగడం దేశ క్రీడా సంస్థలను అవమానించడమేనన్నారు. క్రికెట్ పరంగా చూస్తే గత మ్యాచ్ విన్నర్ అయిన సిరాజ్‌ను బెంచ్‌పై కూర్చోబెట్టడం తనకు కూడా అర్థం కావడం లేదన్నారు. ఇదే సమయంలో ఐపీఎల్ నుంచి ఎంఎస్ ధోనీ (MS Dhoni) రిటైర్మెంట్ నిర్ణయంపై కూడా వాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మతాన్ని లాగడం సిరాజ్‌కు కూడా నచ్చదు:
* క్రీడా వ్యవస్థకే అవమానం: మతపరమైన కోణాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను.. గౌతమ్ గంభీర్ కఠినమైన వ్యక్తిత్వం ఉన్నవాడే కావొచ్చు గానీ, అతడు మతతత్వవాది (Communal) కాదు.. క్రీడల్లో మతానికి స్థానం లేదని మనందరికీ తెలుసు.. ఇలాంటి ఆరోపణలు చేయడం మన క్రీడా సంస్థల పరువు తీసినట్లే అవుతుంది.. ఈ వివాదాన్ని సాగదీయడం అనవసరమని స్వయంగా సిరాజ్, ఇతర ప్లేయర్స్ అనుకుంటున్నారని అతుల్ వాసన్ పేర్కొన్నారు.
* క్రికెట్ పరంగా అది పొరపాటే: సిరాజ్ గత మ్యాచ్‌లో మ్యాచ్ విన్నర్. అంతకుముందు వన్డే కూడా ఆడి మంచి ఫామ్‌లో ఉన్నాడు. గాయం సమస్య ఉంటే తప్ప, అంత అనుభవం ఉన్న బౌలర్‌ను పక్కన పెట్టడం ఖచ్చితంగా తప్పే (Blunder).. కొత్త ప్లేయర్స్ ని తయారు చేయాలనే గంభీర్ ఆలోచన బాగానే ఉన్నా, జట్టును ఇక్కడి వరకు తీసుకొచ్చిన ఆటగాళ్లను పక్కన పెట్టడం విచిత్రంగా ఉందన్నాడు.
కివీస్ గడ్డపై భారత్ ఆడుతున్న తీరు అద్భుతం:
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 70/5 నుంచి 368 పరుగులు చేసినప్పటికీ, ఆ తర్వాత యశస్వీ జైస్వాల్ (85), కేఎల్ రాహుల్ (136) నెలకొల్పిన 130 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యంపై వాసన్ ప్రశంసల వర్షం కురిపించారు. WTC పాయింట్ల ఒత్తిడిని పక్కన పెట్టి, మ్యాచ్‌పై మాత్రమే దృష్టి సారిస్తే కివీస్ గడ్డపై టీమిండియా అద్భుత విజయం సాధించగలదని వాసన్ ధీమా వ్యక్తం చేశారు.
ఫ్రాంచైజీ కోసమే ధోనీ రెండేళ్లు కష్టపడ్డాడు:
19 ఏళ్ల సుదీర్ఘ ఐపీఎల్ ప్రయాణానికి ముగింపు పలుకుతూ, IPL 2027 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మెంటార్‌గా ఎంపికైనా ఎంఎస్ ధోనీ నిర్ణయాన్ని అతుల్ వాసన్ సమర్థించారు.
* CSK కోసమే త్యాగం: గత రెండేళ్లుగా ధోనీ మైదానంలో కొంత ఇబ్బంది పడటాన్ని మనం చూశాం.. నిజానికి ధోనీ ఇష్టానికే వదిలేస్తే అతడు ఎప్పుడో రిటైర్ అయ్యేవాడు.. కానీ ఫ్రాంచైజీ అవసరాలు, బిజినెస్ మోడల్ కోసం అతడు ఆ త్యాగం చేశాడు.. ఒక దిగ్గజ ప్లేయర్ ఇబ్బంది పడుతూ ఆడటాన్ని అభిమానులు గుర్తుంచుకోవాలని ఏ ఆటగాడూ కోరుకోడు.. అందుకే ఆటకు వీడ్కోలు పలికి సరైన నిర్ణయం తీసుకున్నాడని వాసన్ చెప్పుకొచ్చాడు.
* ధోనీ ఐపీఎల్ రికార్డులు: 17 సీజన్ల పాటు CSKకు ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా 5 ఐపీఎల్ టైటిళ్లు (2010, 2011, 2018, 2021, 2023), 2 ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లు అందించాడు. మొత్తం 278 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 38.30 సగటు, 137.45 స్ట్రైక్ రేట్‌తో 5,439 పరుగులు (24 హాఫ్ సెంచరీలు, 264 సిక్సర్లు) సాధించాడు.
