కిలో బియ్యం రూ.82 మించి అమ్మొద్దు.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు

కిలో బియ్యం రూ.82 మించి అమ్మొద్దు.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ పెరుగుతున్న బియ్యం ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొద్దికాలంగా బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు భారీగా పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో కిలో బియ్యం ధర రూ.80 నుంచి రూ.100 వరకు చేరగా, ప్రముఖ సన్న రకాల ధరలు కూడా సామాన్యులకు భారంగా మారాయి. ఈ క్రమంలో.. ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయడంతో పాటు అక్రమ నిల్వలు, కృత్రిమ కొరతను నివారించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.

ఇందులో భాగంగా మిల్లర్లు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు బియ్యం, ధాన్యం నిల్వలపై పరిమితులు విధిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ MTU రకం బియ్యం కిలో గరిష్ఠ ధరను రూ.47గా నిర్ణయించింది. BPT సోనా, సాంబా, KNM రకాలకు రూ.66, HMT, RNR రకాలకు రూ.76, జై శ్రీరామ్ రకానికి రూ.82గా ధరలు ఖరారు చేసింది. వ్యాపారులు తమ నిల్వల వివరాలను కేంద్ర ప్రభుత్వ ఫుడ్ స్టాక్ పోర్టల్‌లో నమోదు చేసి, ప్రతి శుక్రవారం అప్‌డేట్ చేయాలని ఆదేశించింది.

అలాగే దుకాణాల దగ్గర వినియోగదారులకు కనిపించేలా ధరల పట్టికలను తప్పనిసరిగా ప్రదర్శించాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించినా, అక్రమంగా నిల్వలు చేసినా తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఉల్లంఘనలకు రూ.50 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. పెరిగిన బియ్యం ధరలతో సతమతమవుతున్న వినియోగదారులకు ఈ నిర్ణయాలు ఊరటనిచ్చేలా ఉన్నప్పటికీ వ్యాపారులు ఈ నిబంధనలను ఎంత వరకూ పాటిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.