బెజవాడ దుర్గమ్మ ఆలయంలో టికెట్ల స్కాం.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగిపై వేటు..!

బెజవాడ దుర్గమ్మ ఆలయంలో టికెట్ల స్కాం.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగిపై వేటు..!

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దర్శన టికెట్ల స్కాం వెలుగులోకి వచ్చింది. అమ్మవారి దర్శన టికెట్ల విక్రయంలో అక్రమాలకు పాల్పడుతున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని సస్పెండ్ చేశారు అధికారులు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... గురువారం ( నవంబర్ 20 ) సాయంత్రం సీసీటీవీ కెమెరా ద్వారా ఓం టర్నింగ్ దగ్గర ఉన్న దర్శన టికెట్ల కౌంటర్‌లో జరుగుతున్న అక్రమాలను దేవస్థానం ఈవో స్వయంగా పసిగట్టి, సదరు ఉద్యోగిని వీడియో ఆధారాలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.  

​దేవస్థానంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిపై పంచవాయిద్య కారునిగా పనిచేస్తున్న చంద్రమౌళి, గత నెల రోజులుగా సిబ్బంది విధుల సర్దుబాటులో భాగంగా ఓం టర్నింగ్ వద్ద గల దర్శన టికెట్ల జారీ కౌంటర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం సాయంత్రం సుమారు 5:30 గంటల సమయంలో ఈవో  శీనా నాయక్ లైవ్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తుండగా, సదరు ఉద్యోగి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది. 

వెంటనే వైర్‌లెస్ సెట్ ద్వారా సమీపంలోని ప్రోటోకాల్ విభాగపు సిబ్బందిని అప్రమత్తం చేసి, అతని దగ్గర ఉన్న నగదు, టికెట్ల సంఖ్యను లెక్కించే విధంగా ఆకస్మిక తనిఖీ చేయాలని ఆదేశించారు ఈవో శీనా నాయక్. తనిఖీ సమయంలో చంద్రమౌళి టికెట్ల కంప్యూటర్‌కు అడ్డుగా నిలబడి, సిసి కెమెరా కంటబడకుండా నగదును తన జేబులో పెట్టుకుంటూ అవకతవకలకు పాల్పడటం ప్రత్యక్షంగా కనిపించిందని తెలిపారు అధికారులు.

నిందితుడి దగ్గర రూ.18వేల 600 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు అధికారులు. అనంతరం అతడిని ఉన్నతాధికారుల ముందు ప్రవేశపెట్టామని..విచారించిన అధికారులు అతడిని విధుల నుంచి తొలగించాలని.. అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

భక్తుల విశ్వాసంతో ముడిపడి ఉన్న ఆలయ విధులలో ఎవరైనా అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, ముందస్తు సమాచారం, పక్కా ఆధారాలతో నిఘా వేసి సదరు వ్యక్తిని పట్టుకున్నామని ఈవో స్పష్టం చేశారు.