హైదరాబాద్: క్రీడాకారులకు సరైన సమయంలో తగిన అవకాశం లభించడం అదృష్టమని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. మీరు ప్రపంచం వైపు చూడకుండా.. ప్రపంచమే మీ వైపు చూసేలా ఆడాలి అంటూ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. క్రీడలపై పూర్తి ధ్యాస పెట్టి నిరంతరం సాధన చేస్తే రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురాగలరని ఆకాంక్షించారు. విద్యార్థులు క్రీడల్లో రాణించి రాష్ట్రానికి, దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. క్రీడల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే క్రమశిక్షణ, ఏకాగ్రత, పట్టుదలతో పాటు నిరంతర సాధన ఎంతో అవసరమని అన్నారు.
70వ ఎస్జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్ కమ్ సెలక్షన్ 2026–27ను మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో క్రీడా రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, విద్యార్థులను భవిష్యత్తులో గొప్ప క్రీడాకారులుగా తీర్చిదిద్దడం తన బాధ్యతగా భావిస్తున్నానని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధికి, ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఖేలో ఇండియా క్రీడా పోటీలను తెలంగాణకు తీసుకురావడం తమ ప్రభుత్వ ఘనతగా పేర్కొన్నారు. రాష్ట్రంలో చిన్న స్థాయి క్రీడా టోర్నమెంట్లు నిర్వహించినా స్వయంగా హాజరై క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నానని చెప్పారు.
క్రీడల్లో విజయం సాధించాలంటే ఆటపై ప్రత్యేక ఆసక్తి, లక్ష్యంపై ఏకాగ్రత, గెలవాలనే పట్టుదల ఉండాలని మంత్రి సూచించారు. నిరంతర సాధనతోనే ఉన్నత స్థాయికి చేరుకోగలమని చెప్పారు. ఒకప్పుడు పిల్లలు ఆటలు ఆడితే తల్లిదండ్రులు మందలించేవారని, ప్రస్తుతం పిల్లలు ఆడకపోతే తల్లిదండ్రులే మందలించే పరిస్థితి వచ్చిందని, ఇది సమాజంలో క్రీడల పట్ల పెరుగుతున్న అవగాహనకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
క్రీడలు ఎవరి సొత్తు కాదని, ప్రతిభ, పట్టుదల ఉంటే ఎవరైనా ప్రపంచ స్థాయికి ఎదగవచ్చని అన్నారు. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ ఉదాహరణను ప్రస్తావిస్తూ.. ఆయన ఉన్నత కుటుంబంలో జన్మించకపోయినా తన ప్రతిభ, కృషితో ప్రపంచస్థాయి క్రీడాకారుడిగా గుర్తింపు పొందారని గుర్తుచేశారు. విద్యార్థులు కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకుని తమ లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
