హైదరాబాద్: గేటెడ్ కమ్యూనిటీల్లో ఏర్పాటు చేసిన మురుగునీటి శుద్ధి కేంద్రాలను (ఎస్టీపీ) వంద శాతం వినియోగించుకోవాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. శుద్ధి చేసిన నీటిని పూర్తిస్థాయిలో పునర్వినియోగించుకోవాలని, భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేయడాన్ని తగ్గించాలని స్పష్టం చేశారు. గార్డెనింగ్‌తో పాటు ఇతర అవసరాలకు శుద్ధి చేసిన నీటినే వినియోగించాలని సూచించారు. మురుగునీటిని శుద్ధి చేయకుండా నేరుగా కాలువల్లోకి వదలరాదని హెచ్చరించారు.
నల్లగండ్ల చెరువు అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా సమీపంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఎస్టీపీ పనితీరును తనిఖీ చేశారు. అక్కడ శుద్ధి చేసిన నీటి నాణ్యతపై ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఎస్టీపీ నుంచి వెలువడుతున్న శుద్ధి చేసిన నీటిలో బీఓడీ (బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్) 25.5 mg/Lగా నమోదైంది. హైదరాబాద్‌లో అనుమతించిన 20 mg/L పరిమితి కంటే ఇది అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే నీటి టర్బిడిటీ 20.81 NTUగా, డిసాల్వ్డ్ ఆక్సిజన్ (డీఓ) స్థాయి 0.66 mg/Lగా నమోదైంది. ఈ నేపథ్యంలో ఎంబీఆర్ మెంబ్రేన్ పనితీరును మరింత క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు.
నీటి నాణ్యతపై పూర్తి స్థాయి నిర్ధారణ కోసం అధికారులు నమూనాలను సేకరించి తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలికి పంపించారు. ల్యాబ్ నివేదికలు వచ్చిన తర్వాత ఎస్టీపీ పనితీరుపై తదుపరి పరిశీలన చేపట్టనున్నారు.
గేటెడ్ కమ్యూనిటీల నుంచి వెలువడే మురుగునీరు శుద్ధి కాకుండా చెరువుల్లోకి చేరకుండా నిరంతరం పర్యవేక్షించాలని హైడ్రా అధికారులు నిర్ణయించారు. చెరువుల పరిరక్షణకు మురుగునీటి శుద్ధి, శుద్ధి చేసిన నీటి పునర్వినియోగం తప్పనిసరి అని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. బోర్లపై ఆధారపడటాన్ని తగ్గించి, శుద్ధి చేసిన నీటిని గరిష్ఠంగా వినియోగించుకోవడం ద్వారా భూగర్భ జలాల సంరక్షణకు తోడ్పడాలని గేటెడ్ కమ్యూనిటీలకు సూచించారు.
