కారులో దెయ్యం! డ్రైవర్ లేకుండానే రాత్రంతా 868 సార్లు చక్కర్లు కొట్టిన EV కారు

కారులో దెయ్యం! డ్రైవర్ లేకుండానే రాత్రంతా 868 సార్లు చక్కర్లు కొట్టిన EV కారు

కారు అంటే మనుషులు నడుపుతారు.. ఇది మొన్నటి వరకు. ఇప్పుడు డ్రైవర్ లేని కార్లు వచ్చేశాయి. మనం ఎక్కడికి వెళ్లాలో చెబితే అదే తీసుకెళుతుంది. వీటిని డ్రైవర్ లెస్ కార్లు అంటున్నారు. ఇప్పటికే టెస్లాతోపాటు చైనాలో బోలెడు కంపెనీలు డ్రైవర్ లేని కార్లు తీసుకొచ్చాయి. చైనాలో ఓ డ్రైవర్ లెస్ కారు.. పార్కింగ్ ప్లేస్ లో దాని అంతట అదే అటూ ఇటూ తిరిగింది. రాత్రంతా ఇలాగే తిరుగుతుంది. ఒక పార్కింగ్ ప్లేస్ నుంచి మరో పార్కింగ్ ప్లేస్ లోకి ఇలా.. రాత్రంతా 868 సార్లు చక్కర్లు కొట్టింది. ఇదంతా సీసీకెమెరాలో రికార్డ్ అయ్యింది. ఉదయం వరకు ఇలా 868 సార్లు ఈ డ్రైవర్ లెస్ కార్లు అటూ ఇటూ తిరుగుతూనే ఉంది. ఈ వీడియో చూసినోళ్లు.. కారులో దెయ్యం ఏమైనా దూరిందా ఏంటీ.. కారులో దెయ్యం ఉన్నట్లు ఉంది అంటూ కామెంట్లు చేయటం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న చైనా కారు కథ ఏంటో పూర్తిగా తెలుసుకుందామా...


చైనాలోని అండర్ గ్రౌండ్ గ్యారేజీల్లో డ్రైవర్లు లేని ఎలక్ట్రిక్ కార్లు వాటంతట అవే పార్కింగ్ విన్యాసాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హువావే (Huawei) కియాన్కున్ ఇంటెలిజెంట్ డ్రైవింగ్ టెక్నాలజీతో పనిచేసే అవతార్ (Avatr), హువాజింగ్ (Huajing) మోడళ్లు ఇలా అర్థరాత్రి వేళ గ్యారేజీల్లో తిరుగుతూ కనిపించాయి. 

నవంబర్ 2026లో వెలుగులోకి వచ్చిన ఒక వీడియోలో అవతార్ 06, అవతార్ 12 మోడళ్లు తెల్లవారుజామున 6 గంటల సమయంలో పక్కపక్కనే ఒకే రకమైన పార్కింగ్ విన్యాసాలు చేస్తూ కనిపించాయి. నిశ్శబ్దంగా ఉన్న గ్యారేజీలో ఈ రెండు కార్లు ఒకే పద్ధతిలో కదలడం గమనార్హం. హువావే నిర్వహించిన ఒక డ్రైవింగ్ పోటీలో భాగంగా, యజమానులు తమ కార్లలోని అసిస్టెడ్ పార్కింగ్ ఫీచర్లను ఉపయోగించినందుకు రివార్డులు పొందేందుకు ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది.

'రెండవ హువావే కియాన్కున్ ఇంటెలిజెంట్ డ్రైవింగ్ ఓపెన్' పేరుతో అక్టోబర్ 31 నుంచి నవంబర్ 13 వరకు ఈ పోటీలు జరిగాయి. ఎనిమిది విభాగాల్లో జరిగిన ఈ పోటీలో సుమారు 1.90 లక్షల మంది వాహన యజమానులు రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో 'పార్కింగ్ ఎలైట్' కేటగిరీ కింద ఆటోమేటిక్ పార్కింగ్ అసిస్ట్ (APA), రిమోట్ పార్కింగ్ అసిస్ట్ (RPA) వంటి ఫీచర్లను విజయవంతంగా వాడిన వారికి పాయింట్లు కేటాయిస్తారు. టాప్ 100లో నిలిచిన వారికి హువావే పాయింట్లను బహుమతిగా ప్రకటించారు.

తమ ర్యాంకులను పెంచుకోవడానికి యజమానులు పదే పదే పార్కింగ్ విన్యాసాలు చేస్తున్నట్లు సోషల్ మీడియా పోస్టులు వివరిస్తున్నాయి. ఒక యజమాని అయితే ఒకే రోజులో 1,000 సార్లు పార్కింగ్ సెషన్లను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని స్వతంత్రంగా నిర్ధారించాల్సి ఉంది .

హువావే నిబంధనల ప్రకారం, ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల మధ్య చేసే ప్రయత్నాలను మాత్రమే పోటీకి పరిగణనలోకి తీసుకుంటారు. కానీ కొన్ని వీడియోల్లో కార్లు అర్థరాత్రి 12 నుండి తెల్లవారుజామున 6 గంటల మధ్య కూడా కదులుతూ కనిపించాయి. ఈ సమయంలో చేసే ప్రయత్నాలకు పాయింట్లు రాకపోయినప్పటికీ, కార్లు ఎందుకు తిరుగుతున్నాయనేది చర్చనీయాంశమైంది. చైనాలో అర్థరాత్రి వేళ విద్యుత్ ఛార్జీలు తక్కువగా ఉంటాయని, ఆ సమయంలో బ్యాటరీ పవర్ వాడుతూ కార్లు ఇలా గ్యారేజీల్లో తిరుగుతున్నాయని సమాచారం.

ఈ విన్యాసాల్లో అవతార్ 06, 11, 12 మోడళ్లతో పాటు హువాజింగ్ S క్రాస్ ఓవర్ కార్లు ఉన్నట్లు గుర్తించారు. అవతార్ కంపెనీలో చంగన్ (Changan) 40.99 శాతం, బ్యాటరీ దిగ్గజం క్యాట్ల్ (CATL) 14.1 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. హువావే వీటికి ఇంటెలిజెంట్ డ్రైవింగ్ టెక్నాలజీని అందిస్తోంది. హువావే ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ యు తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటికే 20కి పైగా బ్రాండ్లలోని 20 లక్షల వాహనాల్లో ఈ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేశారు.

►ALSO READ | వారం క్రితమే ఉద్యోగం.. అంతలోనే విషాదం.. అమెరికాలో నల్గొండ జిల్లా యువకుడు మృతి

కార్లు ఇలా పదే పదే కదలడానికి మూడు రకాల కారణాలు ఉండవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. యజమానులు తమ స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా కార్లను పార్కింగ్ స్పేస్ నుండి బయటకు తీసి మళ్లీ పార్క్ చేయడం ఒక కారణం కావచ్చు. అలాగే గ్యారేజీలో వెలుతురు సరిగ్గా లేకపోవడం లేదా పార్కింగ్ లైన్లు సరిగ్గా లేకపోవడం వల్ల సెన్సార్లు కన్ఫ్యూజ్ అయ్యి, కారు సరైన స్థలం కోసం పదే పదే వెతుకుతూ ఉండవచ్చు. సాఫ్ట్‌వేర్ లోపం కూడా మరో కారణం అయ్యే అవకాశం ఉంది, అయితే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దీన్ని ధృవీకరించలేమని కంపెనీ వర్గాలు తెలిపాయి.

హువావే కియాన్కున్ ఏడీఎస్ (ADS) అనేది కేవలం డ్రైవర్ అసిస్టెన్స్ టెక్నాలజీ మాత్రమేనని, ఇది డ్రైవర్‌కు ప్రత్యామ్నాయం కాదని కంపెనీ స్పష్టం చేసింది. కారు కదులుతున్నప్పుడు డ్రైవర్ అప్రమత్తంగా ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. చైనాలో జనవరి 2026 నుండి అమల్లోకి వచ్చిన కొత్త జాతీయ ప్రమాణాల (GB/T 47031-2026) ప్రకారం, ఆటోమేటెడ్ పార్కింగ్ సిస్టమ్స్ గరిష్టంగా గంటకు 30 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్లాలి. అవతార్ 06 మోడల్ రిమోట్ పార్కింగ్ సమయంలో గంటకు సుమారు 5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ డాక్యుమెంటేషన్ పేర్కొంది.