నూడుల్స్.. ఇంటిల్లిపాది ఎంతో ఇష్టంగా తినే ఫుడ్. రెండు నిమిషాల్లో అని చెబుతారు కానీ.. 5 నుంచి 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది. పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎంతో ఇష్టంగా తినే ఫుడ్. ఇలాంటి నూడుల్స్ తిన్న అక్కాచెళ్లెళ్లు అనారోగ్యం బారిన పడ్డారు.
నూడుల్స్ తిన్న తర్వాత వాంతులు కావటంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఓ చిన్నారి చనిపోగా.. మరో చిన్నారి చికిత్స పొందుతుంది. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ సిటీలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందర్నీ షాక్కు గురి చేసింది. ఎందుకు అంటే.. ప్రతి ఇంట్లో నూడుల్స్ తినటం కామన్ కదా..
జైపూర్లో జరిగిన ఈ విషాదకర ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇంట్లో వండుకున్న నూడుల్స్ తిని చనిపోవడంతో ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోగా, ఆమె సోదరి అస్వస్థతకు గురైంది. శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే ఈ మరణం సంభవించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన బాలికను పిహు కుమావత్ (7)గా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో పిహు, ఆమె అక్క దివ్యాన్షి ఇంట్లోనే ఉన్నారు. వీళ్లిద్దరే స్వయంగా నూడుల్స్ వండుకుని తిన్నట్లు సమాచారం. నూడుల్స్ తినేసి తర్వాత ఇద్దరూ నిద్రపోయారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో తల్లి ఇంటికి చేరుకుని చూసేసరికి చిన్నారులిద్దరూ బెడ్రూంలో అపస్మారక స్థితిలో పడి కనిపించారు.
►ALSO READ | వీళ్లు పిల్లలా.. రాక్షసులా.. ముంబైలో మైనర్ గ్యాంగ్ వీరంగం.. జంటపై కర్రలు, రాళ్లతో దాడి
తల్లి వారిని నిద్రలేపేందుకు ప్రయత్నించగా, పెద్దమ్మాయి దివ్యాన్షి స్పృహలోకి వచ్చింది. అయితే పిహు ఎంతకీ స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఇద్దరు పిల్లలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పిహు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అస్వస్థతకు గురైన దివ్యాన్షికి వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె కోలుకుందని, శుక్రవారం ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చిన్నారులు తిన్న నూడుల్స్ నమూనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆహారంలో ఏవైనా విషపూరిత పదార్థాలు కలిసాయా లేదా నాణ్యత లోపం ఉందా అనే కోణంలో నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL)కి పంపారు. పిహు మరణానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు స్పష్టం చేశారు. పోస్ట్మార్టం నివేదికతో పాటు ల్యాబొరేటరీ ఫలితాలు వచ్చిన తర్వాతే మరణానికి గల అసలు కారణంపై స్పష్టత వస్తుందని దర్యాప్తు అధికారులు తెలిపారు.
