ఈ ఏడాది ప్రారంభంలో బంగారానికే పోటీ ఇస్తూ రాకెట్ వేగంతో దూసుకెళ్లిన వెండి.. ఇప్పుడు అదే వేగంతో కుప్పకూలి నేలచూపులు చూస్తోంది. సరిగ్గా 10 నెలల క్రితం 2026 జనవరిలో కిలో వెండి ధర ఏకంగా రూ.4 లక్షల మార్కును దాటేసి ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ప్రస్తుతం హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.లక్షా 75వేల స్థాయికి కుప్పకూలింది. గడచిన వారం రోజులుగా వేగంగా రేటు పడిపోవటం చూస్తుంటే వచ్చే జనవరి నాటికి కిలో వెండి మళ్లీ పాత రోజుల్లా రూ.లక్ష స్థాయికి పడిపోతుందా అన్న చర్చ మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది.
వెండి ధర ఇంతలా పడిపోవడానికి ప్రధానంగా అంతర్జాతీయ కారణాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం కారణంగా ఫెడరల్ రిజర్వ్ మళ్లీ వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలు బలపడ్డాయి. దీనివల్ల అమెరికా డాలర్ విలువ, ప్రభుత్వ బాండ్ల రాబడి పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు వెండిపై పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసేసుకుంటున్నారు. దీనికి తోడు సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగాల్లో వెండి వినియోగం తగ్గడం కూడా రేట్ల పతనానికి ఆజ్యం పోసింది.
అలాగే ఇన్వెస్టర్లు భారీగా లాభాల స్వీకరణకు దిగడంతో వెండిపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 120 డాలర్ల నుంచి ఏకంగా 50 డాలర్ల దిగువకు పడిపోవడం రేట్ల పతనాన్ని సూచిస్తోంది. రూ.4 లక్షల వద్ద ఎగబడి మరీ వెండిని కొన్న సామాన్యులు, ఇన్వెస్టర్లు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం వెండికి రూ.లక్షా 55వేల స్థాయి వద్ద కీలక సపోర్ట్ ఉందని తెలుస్తోంది. ఒకవేళ అంతర్జాతీయంగా డాలర్ మరింత బలపడి, పారిశ్రామిక డిమాండ్ ఇదే విధంగా తగ్గుతూ పోతే పతనం ఆగదని వ్యాపారులు చెబుతున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే వచ్చే జనవరి నాటికి కిలో వెండి ధర లక్ష రూపాయల స్థాయికి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మధ్యతరగతి ప్రజలు కూడా రేట్లు ఇంకా ఎప్పుడు తగ్గుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
