తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ఈ తేదీల్లో దర్శనం, ఆర్జిత సేవల టికెట్లు విడుదల!

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ఈ తేదీల్లో దర్శనం, ఆర్జిత సేవల టికెట్లు విడుదల!

తిరుమల: శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ కీలక సమాచారం అందించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి గదుల కోటా విడుదల తేదీలను ప్రకటించింది. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు విడతల వారీగా ఆన్‌లైన్‌లో టికెట్లు, టోకెన్లను అందుబాటులోకి తీసుకురానుంది. భక్తులు నిర్ణీత సమయాల్లో టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

21న ఆర్జిత సేవల టికెట్ల విడుదల
తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలకు సంబంధించిన టికెట్లను శనివారం 21న  అంటే ఈరోజు  ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. అలాగే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను విడుదల చేయనుంది.

23న వివిధ దర్శన టోకెన్ల కోటా
ఈ నెల 23న కూడా భక్తుల కోసం పలు రకాల దర్శన టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల చేస్తారు. అలాగే ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు. ఇంకా మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారి ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లను విడుదల చేయనున్నారు.

24న ప్రత్యేక ప్రవేశ దర్శనం, గదుల కోటా
ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని వసతి గదుల కోటాను  విడుదల చేయనుంది.

అధికారిక వెబ్‌సైట్‌లో బుకింగ్
శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి గదులను బుక్ చేసుకోవాలనుకునే భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.inను సందర్శించాలి. టికెట్ల విడుదల సమయంలో రద్దీ ఉండే అవకాశం ఉన్నందున భక్తులు ముందుగానే వెబ్‌సైట్‌లో వివరాలు రెడీ చేసుకోవడం మంచిది.