- రాష్ట్రవ్యాప్తంగా 335 సెంటర్లు
- నిమిషం లేట్ నిబంధన అమలు
- 22 నుంచి 28 అర్ధరాత్రి వరకు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు చాన్స్
- చేతులపై మెహందీ, తాత్యాలిక టాటూలు ఉండొద్దు: టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్
హైదరాబాద్, వెలుగు: ఎస్సై(సివిల్), సమాన పోస్టుల భర్తీకి నిర్వహించే ప్రిలిమినరీ రాత పరీక్ష ఈ నెల 29న జరగనుంది. మొత్తం 275 పోస్టులకు 1,60,712 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 335 ఎగ్జామ్సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక బోర్డు(టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటన రిలీజ్చేశారు.
ఈ నెల 22న ఉదయం 8 గంటల నుంచి 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్ టీఎస్ఎల్పీఆర్బీ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. సమస్యలుంటే [email protected]కు మెయిల్ లేదా 040-41895151 నంబర్‌కు ఫోన్‌చేయాలని సూచించారు. పరీక్ష సమయంలో అభ్యర్థుల డిజిటల్ ఫొటో, వేలిముద్రలు, సంతకం నమోదు చేయడంతోపాటు ఆధార్ ఫేషియల్ అథెంటికేషన్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వేలిముద్రలు సరిగా నమోదయ్యేందుకు చేతులకు మెహందీ, తాత్కాలిక టాటూలు లేదా ఇతర అడ్డంకులు ఉండకుండా చూసుకోవాలని తెలిపారు.
ఎలక్ట్రానిక్వస్తువులకు నో పర్మిషన్
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఎ4 సైజు పేపర్‌పై రెండువైపులా ప్రింట్ తీసుకోవాలి. ఫొటో లేని హాల్‌టికెట్‌తో పరీక్షకు అనుమతించరు. పరీక్ష ప్రారంభానికి గంట ముందే అభ్యర్థులను సెంటర్లలోకి అనుమతిస్తారు. ఎగ్జామ్ప్రారంభమైన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి ప్రవేశం ఉండదు. అభ్యర్థులు ముందురోజే తమ పరీక్ష కేంద్రాన్ని సందర్శించి చిరునామా, మార్గాన్ని నిర్ధారించుకోవాలి. పరీక్ష కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లు, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్ పరికరాలు, వాచ్‌లు, స్మార్ట్ గ్లాసెస్, కాలిక్యులేటర్లు, పర్సులు, నోట్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు. అభ్యర్థులు బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ను, హాల్‌టికెట్ మాత్రమే తీసుకెళ్లాలి. విలువైన వస్తువులు భద్రపరిచేందుకు పరీక్ష కేంద్రాల్లో క్లోక్‌రూమ్ లేదా స్టోరేజ్ సదుపాయం ఉండదని చైర్మన్ స్పష్టం చేశారు.
నెగెటివ్ మార్కులు
ప్రిలిమినరీ పరీక్షలో తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుందని చైర్మన్పేర్కొన్నారు. ఓఎంఆర్ జవాబు పత్రంపై అనవసరమైన రాతలు, గుర్తులు, మతపరమైన చిహ్నాలు లేదా ప్రత్యేక గుర్తులు వేస్తే మాల్‌ప్రాక్టీస్‌గా పరిగణించి పత్రాన్ని మూల్యాంకనం చేయబోమని హెచ్చరించారు. ప్రశ్నలు ఇంగ్లిష్–తెలుగు, ఇంగ్లిష్-–ఉర్దూ భాషల్లో ఉంటాయన్నారు. ట్రాన్స్‌లేషన్‌లో సందిగ్ధత ఏర్పడితే ఇంగ్లిష్ వెర్షన్‌నే తుది ప్రమాణంగా పరిగణిస్తారని తెలిపారు.
