- మూడేండ్లలో సగటు ఎగుమతులురూ.1.33 లక్షల కోట్లు.. 68.3 శాతం వృద్ధి
- ఏరోస్పేస్, డిఫెన్స్, ఫార్మా రంగాల్లో రికార్డు ప్రగతి
- యాదాద్రిలోనూ భారీ వృద్ధి
- కేంద్ర వాణిజ్య, గణాంకాల డైరెక్టరేట్ జనరల్, ఈఈపీసీ నివేదికల్లో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఎగుమతులు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మూడేండ్ల పాలనలో రాష్ట్ర వస్తు ఎగుమతులు (మర్చండైజ్ ఎక్స్‌పోర్ట్స్) సగటున 68.3 శాతం వృద్ధిని నమోదు చేశాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ చివరి మూడేండ్లతో పోలిస్తే సగటు వార్షిక ఎగుమతులు రూ.79 వేల కోట్ల నుంచి రూ.1.33 లక్షల కోట్లకు పెరిగాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్, ఫార్మా, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో ఎగుమతులు గణనీయంగా పుంజుకున్నాయి. ఎలక్ట్రికల్ మెషినరీ, ఎయిర్‌క్రాఫ్ట్, స్పేస్‌క్రాఫ్ట్ విడిభాగాలు, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగాయి. దీంతో ఏరోస్పేస్, డిఫెన్స్ తయారీ రంగాలకు తెలంగాణ కీలక కేంద్రంగా ఎదుగుతున్నది. కేంద్ర వాణిజ్య, గణాంకాల డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఐ అండ్ ఎస్), ఇంజినీరింగ్ ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ (ఈఈపీసీ) నివేదికలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
రూ.79 వేల కోట్ల నుంచి రూ.1.33 లక్షల కోట్లకు..
డీజీసీఐ అండ్ ఎస్ గణాంకాల ప్రకారం.. 2020–2023 మధ్య రాష్ట్ర సగటు వార్షిక వస్తు ఎగుమతులు రూ.79 వేల కోట్లుగా ఉన్నాయి. 2023–2026 మధ్య ఇవి రూ.1,33,000 కోట్లకు చేరాయి. తయారీ రంగానికి ప్రభుత్వం అందించిన సహకారంతో ఈ పురోగతి సాధ్యమైనట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఆరేండ్లలో ఎగుమతులు 2020–21లోని రూ.64,539 కోట్ల నుంచి 2025–26 నాటికి రూ.1.22 లక్షల కోట్లకు పెరిగాయి. 2024–25లో అత్యధికంగా రూ.1,61,843 కోట్ల విలువైన వస్తు ఎగుమతులు నమోదయ్యాయి. ఇందులో ఎయిర్‌క్రాఫ్ట్, స్పేస్‌క్రాఫ్ట్ విడిభాగాల వాటా ఒక్కటే దాదాపు 30 శాతంగా ఉంది. ఎలక్ట్రికల్ మెషినరీ, మెకానికల్ అప్లయన్సెస్ ఎగుమతులు కూడా భారీగా పెరిగాయి. ఈ రెండు విభాగాల ఎగుమతులు 2024–25లోని రూ.14,632.20 కోట్ల నుంచి 2025–26లో రూ.17,764.81 కోట్లకు చేరాయి. ఇది 21.41 శాతం వృద్ధి. దీంతో రాష్ట్ర మొత్తం వస్తు ఎగుమతుల్లో ఈ కోర్ ఇంజినీరింగ్ విభాగాల వాటా 9.04 శాతం నుంచి 14.48 శాతానికి పెరిగింది.
ప్రాంతీయ కేంద్రాల్లోనూ ఎగుమతుల విస్తరణ
ప్రభుత్వం అనుసరిస్తున్న క్యూర్, ప్యూర్, రేర్ అభివృద్ధి ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా ప్రాంతీయ వృద్ధి కేంద్రాల్లోనూ తయారీ రంగ ఎగుమతులు పెరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ఎగుమతులు 2024–25లోని రూ.6,818.20 కోట్ల నుంచి 2025–26లో 56.17 శాతం పెరిగి రూ.10,648.13 కోట్లకు చేరాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఎగుమతులు ఇదే కాలంలో రూ.3,117.97 కోట్ల నుంచి 32.13 శాతం వృద్ధితో రూ.4,119 కోట్లకు పెరిగాయి. లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, ఎయిర్‌బస్, సాఫ్రాన్, రఫేల్, హనీవెల్, జీఈ ఏవియేషన్, ప్రాట్ అండ్ విట్నీ, కాలిన్స్ ఏరోస్పేస్ వంటి అంతర్జాతీయ ఏరోస్పేస్, డిఫెన్స్ సంస్థలు రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ సంస్థలు మాన్యుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్, మెయింటెనెన్స్, ట్రైనింగ్ హబ్‌లను నడుపుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026'లో ప్రభుత్వం నాలుగు కొత్త పాలసీలను ప్రకటించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇండస్ట్రీస్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్ పాలసీలను
ఆవిష్కరించనుంది.
ఇంజినీరింగ్ ఎగుమతుల్లోనూ జోరు
ఈఈపీసీ గణాంకాల ప్రకారం.. 2025 అక్టోబర్‌తో పోలిస్తే 2026 అక్టోబర్‌లో తెలంగాణ ఇంజినీరింగ్ ఎగుమతులు 69 శాతం పెరిగాయి. 2026–27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ మధ్య కూడా గతేడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 31 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడు నెలల్లో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ పార్ట్స్ ఎగుమతులు 244 శాతం, లెడ్, లెడ్ ఉత్పత్తులు 196 శాతం, కాపర్, కాపర్ ఉత్పత్తులు 106 శాతం పెరిగాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాల వారీ ఎగుమతుల్లో మేడ్చల్–మల్కాజిగిరి రూ.29,131 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్ర మొత్తం ఎగుమతుల్లో ఈ జిల్లా వాటా 23.75 శాతం. హైదరాబాద్ రూ.26,437.55 కోట్లతో 21.55 శాతం వాటా సాధించి రెండో స్థానంలో, సంగారెడ్డి రూ.24,970.43 కోట్లతో 20.36 శాతం వాటాతో మూడో స్థానంలో నిలిచాయి. పారిశ్రామిక కేంద్రాలుగా ఉన్న ఈ మూడు జిల్లాల నుంచే రాష్ట్ర ఎగుమతుల్లో ప్రధాన వాటా నమోదైంది.
