హైదరాబాద్, వెలుగు: పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో హోంగార్డుల నియామకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2 వేల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ పై డీజీపీ సీవీ ఆనంద్ ఫోకస్‌పెట్టారు. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పోలీస్ శాఖను తీర్చిదిద్దడం, సిబ్బంది సంక్షేమం, శిక్షణ, నియామకాలు, పోలీస్ వ్యవస్థ ఆధునీకరణపై మినీ స్టాఫ్ ఆఫీసర్స్‌తో శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
పోలీస్ సిబ్బంది వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు వార్షిక శిక్షణ క్యాలెండర్ రూపొందించాలని నిర్ణయించారు. డిసెంబర్‌లో నిర్వహించనున్న పోలీస్ రిట్రీట్, మహిళా పోలీస్ అధికారుల సదస్సు ఏర్పాట్లపై ఆరా తీశారు. తెలంగాణ పోలీస్ నూతన మాన్యువల్ రూపకల్పన, పోలీస్ బ్రాస్, పైప్ బ్యాండ్లను పునరుద్ధరించడం వంటి అంశాలపై చర్చించారు.
రాష్ట్రస్థాయి డ్యూటీ మీట్ నిర్వహణతోపాటు, ఆలిండియా పోలీస్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించిన ప్రణాళికలను పరిశీలించారు. ఉద్యోగ విరమణ పొందిన పోలీసుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమావేశంలో చర్చించిన ప్రతీ అంశానికి సంబంధించి అధికారులకు నిర్దిష్ట బాధ్యతలు అప్పగించారు. నిర్దేశిత సమయంలో లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
