న్యూఢిల్లీ, వెలుగు: పీఎం స్వనిధి పథకం అమలులో వేగంగా పురోగతి సాధించిన రాష్ట్రాల కేటగిరీలో ఫాస్టెస్ట్ మూవర్ స్టేట్ గా తెలంగాణ నిలిచింది. ఈ విభాగంలో తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు చోటు దక్కించుకున్నాయి. శుక్రవారం ఢిల్లీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ పీఎం స్వనిధి సమ్మాన్ అవార్డ్స్–2026 లను అందజేశారు.
వీధి వ్యాపారుల జీవనోపాధిని బలోపేతం చేయడం, వారికి బ్యాంకు రుణాలు అందించడం, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం, సామాజిక భద్రత కల్పించడంలో ప్రతిభ కనబరిచిన రాష్ట్రాలు, పట్టణ స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటించింది. ఇందుకోసం 29 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 4,900 లకు పైగా పట్టణ స్థానిక సంస్థలు, 120కి పైగా రుణ సంస్థలలోని పథకం అమలు వ్యవస్థను కేంద్రం పరిగణనలోకి తీసుకుంది.
పథకం అమలుకు సంబంధించిన పనితీరును 2025 సెప్టెంబర్ 1 నుంచి 2026 ఆగస్టు 31 వరకు ప్రత్యేకంగా అంచనా వేయగా, మొత్తం పనితీరును పథకం ప్రారంభమైనప్పటి నుంచి 2026 ఆగస్టు 31 వరకు పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొంది. ఈ దశలో సేకరించిన గణాంకాల ఆధారంగా 5 విభాగాల్లో మొత్తం 52 అవార్డులను ప్రకటించింది.
కాగా, పథకం అమలులో అగ్రగామి రాష్ట్రాలుగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ నిలిచింది. రుణాల పనితీరు విభాగంలోనూ ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు దక్కింది. అలాగే ప్రత్యేక ప్రచార కార్యక్రమాల అమలులో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అవార్డులు సాధించాయి.
