టర్కీలోని ఆంతాల్యలో కాప్-31 సదస్సు నవంబర్ 9 నుంచి 20 వరకు జరిగింది. సదస్సు భౌతిక నిర్వహణ బాధ్యత టర్కీ తీసుకుంటే చర్చలు, -సంప్రదింపుల బాధ్యత ఆస్ట్రేలియా తీసుకుంది. తొలిసారి ఉభయదేశాల ఉమ్మడి నాయకత్వంలో కాప్ సదస్సు జరిగింది. ఈ ప్రయోగం ఒకరకంగా విఫలమైంది. సమన్వయం, సయోధ్యపరమైనలోపం ఒకటికాగా, రెండు నాయకత్వ దేశాలకూ కాప్ మౌలిక ఆచారణ పరమైన అంశాల్లో స్వీయ నియంత్రణ, నిబద్ధత లోపించడం రెండోది. కర్భన ఉద్గారాల, తద్వారా భూతాపోన్నతి పెరుగుదలను కట్టడి చేసేందుకు శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించడం, ఇతర ప్రత్యామ్నాయాలవైపు మళ్లడంలో వారిద్దరి చరిత్ర గొప్పగా లేదు. ఈసారి ‘కాప్’ సదస్సు ప్రారంభమే సడి-చప్పుడు లేకుండా అప్రాధాన్యంగా ‘లో-కీ’ పద్ధతిలో సాదాసీదాగా మొదలైంది.
వరుస ‘కాప్’ (28,29,30)లు గొప్పగా ప్రారంభం కావడం, నిరాశాజనకంగా ముగియడం వల్లనేమో ప్రసార మాధ్యమాలు (మీడియా) కూడా ఈసారి కాప్ ఆరంభానికి, తదనంతర చర్చలకు తమ కవరేజీలో అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. కాప్ నిర్వాహకులు కూడా మీడియా పట్ల విభిన్నంగానే ప్రవర్తించారు. విమర్శనాత్మకంగా, పలు ప్రశ్నలు, -సందేహాలు లేవనెత్తే స్థానిక మీడియాను ప్రతిఘటించి, ఎక్కడిక్కడ నిర్బంధించి, తాము సౌకర్యాలు కల్పించి ఏర్పరచుకున్న అంతర్జాతీయ మీడియాకు కానుకలిచ్చారు.
ప్రాథమిక లక్ష్యాలకు గండి
కీలకమైన ఎజెండా అంశాలపైన అంతిమ ఏకాభిప్రాయ సాధన కాదుకదా, మౌలికమైన నిర్మాణాత్మక చర్చ-,సంప్రదింపులు కూడా కాప్ 31లో సవ్యంగా జరగలేదు. క్లైమేట్ ఫైనాన్స్ పేరుకే పెంచినట్టు చూపినా ఎవరు ఇవ్వాలి? ఎలా (గ్రాంట్ రూపమా, -లోన్ రూపమా) ఇవ్వాలి? అనే విషయంలో సదస్సు స్పష్టత ఇవ్వలేదు. భారత్, దక్షిణాఫ్రికాతో సహా పలు అభివృద్ధి చెందుతున్న దేశాలు క్టైమేట్ ఫండ్ సహాయాన్ని అధిక వడ్డీ రుణాల రూపంలో ఇస్తామనటాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ఫ్రాన్స్, బ్రిటన్ వంటి ఐరోపా సంఘం (ఈయూ) దేశాలు గ్రాంట్ రూపంలో ఇప్పుడు పెంచిన మొత్తం ఇవ్వడం, క్షీణించిన తమ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దుస్సాధ్యమని, ఇవ్వలేమంటున్నాయి.
2009లో కుదిరిన అంగీకారం ప్రకారం అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న (మూడో ప్రపంచ) దేశాలకు ఏటా పదివేల కోట్ల (వంద బిలియన్) డాలర్ల చొప్పున 2020 నుంచే ఇస్తామన్నారు. 2015 పారిస్ ఒప్పందంలోనూ దానికి కట్టుబడ్డట్లే మాట్లాడారు. కానీ కార్యరూపం దాల్చలేదు. టెక్నాలజీ బదలాయింపు, అప్పులివ్వడం, క్లైమేట్ యాక్షన్లో భాగంగా చెప్పుకునే కొన్ని ప్రాజెక్టుల ఆర్థిక సహాయాలను చూపి, సదరు నిధి- సహాయాలు ఇప్పటికే కొంత ఇచ్చామన్నట్టు అభివృద్ధి సమాజాలు చెబితే, ఎక్కడ? ఎప్పుడు? ఎలా? ఇచ్చారు స్పష్టత ఇవ్వండి, అది హామీ ఇచ్చిన ‘ప్రకారం’ క్లైమేట్ ఫండ్ కాదని పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటున్నాయి. తర్వాత దాన్ని పెంచినట్టు చెబుతూ ఏటా 600 బిలియన్ల డాలర్లు ఇస్తామని తదనంతర సదస్సుల్లో ప్రకటించారు. మూడింతలు పెంచి 1.4 ట్రిలియన్ డాలర్లుగా క్లైమేట్ ఫండ్ తాజా లెక్కలు తెరపైకి వచ్చాయి. కానీ ఎవరిస్తారు? ఇచ్చే విధానంలో అతీగతీ లేదు. సరైన చర్చే జరగలేదు.
సైంధవ నీడ
‘హామీలు చాలిక అమలుపై శ్రద్ధ’ పెట్టాలని ఐక్యరాజ్య సమతి (యూఎన్) ఈ సంవత్సరపు నినాదంగా ప్రకటించింది. యూఎన్ సంకల్ప కార్యక్రమం (యూఎన్ఎఫ్, సీసీసీ)లో భాగంగా జరుగుతున్న పరంపరలో ‘కాప్- 31’ని ఆయా దేశాలు ఇప్పటివరకు ప్రకటించిన దేశాల వారి లక్ష్యాలు (ఎన్డీసీ) అమలు సమీక్షించాలనుకున్నారు. ‘గ్లోబల్ స్టాక్టేక్’ 2028 వరకుంది. అంతర్ ప్రభుత్వాల బృందం నివేదికలు నిజానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన శాస్త్రవేత్తల బృందం నివేదికలు. వాటికి ఎంతో విలువ, విశ్వనీయత ఉంది.
అంచనాలకు మించి వేగంగా, ప్రభావవంతంగా వాతావరణ మార్పులు చోటు చేసుకోవడం, విపరిణామాలు, భూతాపోన్నతి పెరుగుదల, ధృవాల మంచు కరుగుతున్న పరిణామం, సముద్ర జలమట్టాలు పెరిగే స్థాయి, సముద్ర జలాలు వేడెక్కుతున్న తీరు, ఉపరితల వాయువులు వేడెక్కడం వల్ల ఎల్-నినో, లా-నినా ప్రభావాలు వంటి వాటిపై ఐపీసీసీ ఎప్పటికప్పుడు స్పష్టమైన, పారదర్శకమైన నివేదికలిస్తోంది. సదరు స్వతంత్య్ర నివేదికలు కూడా తమ ద్వారా, తాము ధృవీకరించిన మీదట వెల్లడి కావాలని కాప్-31 అభిప్రాయపడింది. వేటికవి ప్రత్యేకంగా ఉండాలి తప్ప, కార్యాచరణ అమలు, - పర్యవేక్షణ బాధ్యత వహించాల్సినవారు క్షేత్ర నివేదికలను ఖరారు చేయడం ఏమిటనే అభ్యంతరం వ్తక్తమౌతోంది. కాప్ భాగస్వాముల మధ్య కూడా ఈ విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి.
కీలక అంశాలపై చర్చ ఏది?
‘ముఖ్య నిర్ణయాలు’పైనే కాకుండా దాదాపు 110 ఇతర ముఖ్య అంశాల్లో వివిధ స్థాయిల్లో చర్చలు, -సంపద్రింపులు ‘కాప్’ సదస్సుల్లో జరుగుతాయి. ఆహార భద్రత, శిలాజ ఇంధనాల వినియోగ నియంత్రణ, సముద్ర జలాలు వేడెక్కడం, లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్, న్యాయబద్ధ బదిలీ (జస్ట్ ట్రాన్సిట్) వంటివి ముఖ్యమైనవి. వ్యవసాయం వల్ల వచ్చే కర్బన్ ఉద్గారాలు కాలుష్యానికి కారణమవుతున్నాయనే అంశంలో పరిష్కారాలపై అభివృద్ధి చెందిన-, చెందుతున్న సమాజాల మధ్య పరస్పర విరుద్ధ ఆలోచనలు, ప్రతిపాదనలు ఉన్నాయి.
అంతర్జాతీయ చర్చా వేదిక (కాప్ 31)పైన చర్చించకుండా ఏకాభిప్రాయం ఎలా సాధ్యమౌతుంది?
ఈ విషయంలో సహజ- ప్రకృతి వ్యవసాయం పరిష్కారమని భారత్ అంటోంది. మరింత సాంకేతికత, యాంత్రీకరణ, సేంద్రీయ ఎరువులు, -ఫెస్టిసైడ్స్, రోబోట్స్ వినియోగం పరిష్కారమని అభివృద్ధి చెందిన దేశాలంటున్నాయి. ఇదే తెగని పంచాయతీ. భూతాపం వల్ల హిమాలయ మంచు పర్వతాలు కరిగిన ఉపద్రవంలో నేపాల్ బీభత్సం మనం చూశాం. తొలిసారి లభించిన క్లైమేట్ లాస్ అండ్ డ్యామేజ్ సహాయం నామమాత్రమే అన్నది చర్చకు వచ్చింది. ‘మౌంటెన్ ఎకోసిస్టమ్స్’పై చర్చ జరగాలన్న డిమాండ్ మేరకు ఎజెండాలో చేర్చినా చర్చ లేదు.
అందరూ అందరే
తాజా ’కాప్’లో కొట్టొచ్చినట్టు కనిపించిన అంశం బడా నేతల గైర్హాజరు. అమెరికా పారిస్ ఒప్పందం నుంచి తప్పుకొని క్రమంగా ‘కాప్’కు దూరమయింది. రష్యా, చైనా, భారత్, జపాన్ తదితర దేశాల అధినేతలెవరూ కాప్కు రాలేదు. చమురు దేశాల హాజరీ కూడా అంతంతే! కానీ, చమురు, బొగ్గు, ఇతర లాబీల కార్పొరేట్ శక్తుల ప్రతినిధి బృందాలు ఆయా దేశాల తరఫున ప్రతక్ష్యంగా, పరోక్షంగా పాల్గొన్నాయి. ఎజెండా అంశాల ప్రతిపాదన నుంచి చర్చల సరళి, సంప్రదింపుల ప్రాధాన్యతలు, డ్రాఫ్టులు, ఏకాభిప్రాయ నివేదికలు రూపొందించేవరకు తమ పాత్ర ప్రమేయాలను చూపుతూనే ఉన్నాయి.
నిజానికి ‘కాప్’ ఒక గొప్ప స్ఫూర్తి. పర్యావరణ పరిరక్షణకున్న గ్లోబల్ చర్చా వేదిక. ప్రధాన ఆశాదీపం. కానీ, కొన్ని శక్తులు సదరు స్ఫూర్తికి భంగం కలిగిస్తున్నాయి. కొన్ని దేశాల వాణిజ్య, వర్తక, స్వార్థ ప్రయోజనాలకు అవి భూ గ్రహ (పుడమి) సంరక్షణను, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను పణంగా పెడుతున్నాయి. ఈ అపసవ్య మార్గంలో మరో ‘కాప్’ను అవి ‘ఫ్లాప్’ చేశాయి.
- దిలీప్ రెడ్డి
పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్
