రూ. 20 వేల కోట్లతో  పట్టణాల అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి

రూ. 20 వేల కోట్లతో  పట్టణాల అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి
  • ప్రపంచ బ్యాంకు, ఏడీబీ సహా అంతర్జాతీయ సంస్థల ఆర్థిక సాయంతో ప్రాజెక్టులు 
  • వాతావరణ మార్పులను తట్టుకునేలా పట్టణాల అభివృద్ధి
  • వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భూగర్భ డ్రైనేజీ, వరద నీటి పారుదల వ్యవస్థ
  • వ్యర్థాల నుంచి 12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్లాంట్
  • మురుగునీటి శుద్ధి, పునర్వినియోగానికి ప్రత్యేక పాలసీ
  • పురపాలక శాఖ ప్రతిపాదనలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం పురపాలక శాఖ రూపొందించిన రూ.20 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల ప్రతిపాదనలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. వాతావరణ మార్పులను తట్టుకునేలా, పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాలను తీర్చిదిద్దే ప్రణాళికలపై సమావేశంలో చర్చించారు.

ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ), ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు (ఏఐఐబీ), జర్మనీకి చెందిన కేఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డబ్ల్యూ బ్యాంకుతో పాటు దేశీయ ఆర్థిక సంస్థల సహకారంతో ఈ పనులు చేపట్టేందుకు పురపాలక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టుల ద్వారా పట్టణాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించడం, నీటి వనరులను సంరక్షించడం, వరద ముప్పును నివారించడంతో పాటు పురపాలక సంస్థల నిర్వహణ వ్యయాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

సమీక్షలో భాగంగా వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, వర్షపు నీటి పారుదల వ్యవస్థ నిర్మాణం, వరంగల్ కోట కందకం పునరుద్ధరణ పనుల ప్రతిపాదనలను పరిశీలించారు. అలాగే, హనుమకొండలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (సీబీడీ) అభివృద్ధి అంశంపై అధికారులు చర్చించారు. మరోవైపు వరంగల్ మెగా సిటీ ఎకనామిక్ రీజియన్ పరిధిలో వ్యర్థాల నుంచి 10 నుంచి 12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనను సీఎం సమీక్షించారు. దీనితో పాటు బయో సీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ ఉత్పత్తి, ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుపైనా సమావేశంలో చర్చ జరిగింది.

మురుగు నీటి శుద్ధికి ప్రత్యేక విధానం.. 

రాష్ట్రంలో మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడించారు. శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలకు, ప్రధానంగా టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్ పార్కులకు వినియోగించడం ద్వారా మంచినీటి వనరులపై ఒత్తిడి తగ్గించే అవకాశాలను పరిశీలించారు.

పట్టణాల్లో తాగు నీటి సరఫరా, నీటి శుద్ధి, పంపిణీ వ్యవస్థల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించి పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించే అంశాలపైనా సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంవో కార్యదర్శి మాణిక్ రాజ్, పురపాలక శాఖ కార్యదర్శి టి.కె. శ్రీదేవి పాల్గొన్నారు.