- విద్యానగర్లోని ఆయన నివాసానికి వెళ్లి శాలువాతో సత్కరించిన రేవంత్రెడ్డి
హైదరాబాద్/అంబర్ పేట్, వెలుగు: మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త ఐఐటీ చుక్కా రామయ్య వందో జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యానగర్లోని చుక్కా రామయ్య నివాసానికి వెళ్లిన సీఎం.. ఆయన్ను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఆయన వందో పుట్టినరోజు రాష్ట్ర ప్రజలకు, విద్యా వ్యవస్థకు ఒక గొప్ప పర్వదినమని పేర్కొన్నారు.
పేదలకు విద్యనందించి, ఐఐటీ అనే పదాన్ని రాష్ట్ర ప్రజలకు, విద్యార్థులకు పరిచయం చేసిన గొప్ప విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడని కొనియాడారు. విద్యా రంగంలో సామాజిక పరివర్తన తీసుకొచ్చిన ఆయన జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. శాసనమండలిలో చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారితో కలిసి పనిచేయడం తన అదృష్టమని, ఆ విషయాన్ని ఎప్పుడైనా గర్వంగా చెప్పుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, జూలకంటి రంగారెడ్డి, మధ్యప్రదేశ్ ఎంపీ సుమిత్ర వాల్మీకి, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు సీతారాం, నర్సిరెడ్డి, ఐపీఎస్ అధికారి సజ్జనర్, ప్రొఫెసర్ హరగోపాల్ చుక్కా రామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. అనంతరం చుక్కా రామయ్య నూరేళ్ల పండగ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు.
