- మోటారు వాహనాల నిబంధనలకు సవరణ
- ఉల్లంఘిస్తే ఎంవీ యాక్ట్ ప్రకారం జరిమానా
అహ్మదాబాద్: ప్రైవేట్ వాహనాలపై కులాన్ని సూచించే పదాలు, గుర్తులు, చిహ్నాలు, రాతలు ప్రదర్శించడాన్ని గుజరాత్ ప్రభుత్వం నిషేధించింది. టూవీలర్లు, ఆటోలు, కార్లు, బస్సులు, ట్రక్కులు సహా అన్ని రకాల ప్రైవేట్ వాహనాలకు ఈ నిషేధం వర్తిస్తుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే మోటారు వాహనాల చట్టం–1988లోని జరిమానా నిబంధనల ప్రకారం లేదా కాంపౌండ్ చేసిన చలాన్ల ద్వారా చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు గుజరాత్ రవాణా శాఖ ‘గుజరాత్ మోటారు వాహనాల (మూడో సవరణ) నిబంధనలు–2026’ను ప్రభుత్వం నోటిఫై చేసింది.
గుజరాత్ మోటారు వాహనాల నిబంధనలు–1989లోని రూల్ 125(1)లో ఇప్పటికే ఉన్న ప్రకటన బోర్డులు, బొమ్మలతో పాటు కుల గుర్తులను కూడా స్పష్టంగా చేర్చారు. రూల్ 138కి కొత్తగా సబ్ రూల్ (3) జోడించి, ప్రైవేట్ వాహనాలపై ఎలాంటి ప్రకటనలు, కులాన్ని సూచించే గుర్తులు, బొమ్మలు, రాతలు ప్రదర్శించరాదని నిషేధం విధించారు. వాహనాలను కుల గుర్తింపు ప్రదర్శనకు వాడుకోవడం కుదరదని ఈ సవరణ స్పష్టం చేస్తోంది. ప్రభుత్వం సాధారణ లేదా ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా మినహాయింపులు ఇవ్వొచ్చు.
ఈ సవరణకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను ప్రభుత్వం జూన్ 11న ఎక్స్ట్రార్డినరీ గెజిట్లో ప్రచురించి, 30 రోజుల్లో అభ్యంతరాలు, సూచనలు ఇవ్వాలని కోరింది. గడువులోగా ఎలాంటి అభ్యంతరాలు, సూచనలు రాకపోవడంతో తుది నోటిఫికేషన్ జారీ చేసింది.
