యాసంగిలో 25 శాతం.. వరి స్థానంలో ప్రత్యామ్నాయ పంటలు

యాసంగిలో 25 శాతం.. వరి స్థానంలో ప్రత్యామ్నాయ పంటలు
  •     ఆయిల్‌‌‌‌‌‌‌‌ సీడ్స్‌‌‌‌‌‌‌‌, పప్పుధాన్యాల సాగుకు వ్యవసాయ శాఖ ప్రోత్సాహం
  •      రైతుల వివరాల నమోదుకు  క్రాప్‌‌‌‌‌‌‌‌ డేటా పోర్టల్‌‌‌‌‌‌‌‌
  •     క్షేత్రస్థాయి అధికారులకు వ్యవసాయ శాఖ ఆదేశాలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో రానున్న యాసంగిలో నీటి లభ్యతపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. యాసంగి సాధారణ వరి సాగు విస్తీర్ణంలో కనీసం 25 శాతం మేర నూనెగింజలు, పప్పుధాన్యాలు, ఇతర మెట్ట పంటలు సాగు చేసేలా క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించింది. నీటి వినియోగం తక్కువగా ఉండే పంటల వైపు రైతులను మళ్లించడంతోపాటు, ఆయా పంటలు సాగు చేస్తున్న రైతుల వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేకంగా క్రాప్‌‌‌‌‌‌‌‌ డేటా పోర్టల్‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తెచ్చింది. గ్రామాల వారీగా, రైతులు, క్లస్టర్ల వారీగా సాగు వివరాలను ఇందులో నమోదు చేయాలని స్పష్టం చేసింది.

వరి స్థానంలో నీటి అవసరం తక్కువగా ఉండే పంటలు

రాష్ట్రంలో యాసంగి సాధారణ వరి సాగు విస్తీర్ణం సుమారు 54.33 లక్షల ఎకరాలుగా ఉంది. ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో వర్షపాతం, సాగునీటి లభ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. వరి సాగుకు బదులు నీటి అవసరం తక్కువగా ఉండే పంటలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమతో పాటు పప్పుశనగ, పెసర, మినుము, ఉలవ వంటి పంటలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. నీటి వసతులు ఉన్న ప్రాంతాల్లోనే వరి, మొక్కజొన్న సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించింది.

 ఏఈవోల ద్వారా పంటల వివరాల సేకరణ

ప్రత్యామ్నాయ పంటల సాగును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు, వాస్తవ విస్తీర్ణాన్ని తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక క్రాప్‌‌‌‌‌‌‌‌ డేటా పోర్టల్‌‌‌‌‌‌‌‌ను సిద్ధం చేసింది. రైతులు ఏయే పంటలు, ఎంత విస్తీర్ణంలో, ఏ క్లస్టర్‌‌‌‌‌‌‌‌లో సాగు చేస్తున్నారనే వివరాలను ఇందులో నమోదు చేస్తారు. వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవో) తమ అధికారిక మొబైల్‌‌‌‌‌‌‌‌ నంబర్లతో లాగిన్‌‌‌‌‌‌‌‌ అయి, రైతుల వద్దకు వెళ్లి వివరాలను సేకరించి ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక లాగిన్‌‌‌‌‌‌‌‌ సదుపాయం కల్పించారు.

పెరుగుతున్న ఇతర పంటల సాగు

వ్యవసాయ శాఖ తాజా గణాంకాలు రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. గత యాసంగిలో ఇదే సమయానికి 67,128 ఎకరాల్లో ఉన్న నూనెగింజల సాగు ఈసారి 76,728 ఎకరాలకు పెరిగింది. వేరుశనగ సాగు 65,768 ఎకరాల నుంచి 70,967 ఎకరాలకు, పొద్దుతిరుగుడు 150 నుంచి 2,033 ఎకరాలకు, నువ్వులు 18 నుంచి 228 ఎకరాలకు పెరిగాయి. పప్పుధాన్యాల సాగు 62,537 ఎకరాల నుంచి 70,273 ఎకరాలకు చేరింది. మినుము 6,439 నుంచి 13,076 ఎకరాలకు, పెసర 103 నుంచి 4,493 ఎకరాలకు పెరిగాయి. మరోవైపు మొక్కజొన్న సాగు 80,895 నుంచి 45,546 ఎకరాలకు, వరి సాగు 8,272 నుంచి 96 ఎకరాలకు తగ్గింది.

సాగు ప్రణాళికకు పోర్టల్‌‌‌‌‌‌‌‌ కీలకం
యాసంగిలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల ప్రణాళిక రూపొందించడంలో, రైతులకు అవసరమైన సలహాలు అందించడంలో ఈ పోర్టల్‌‌‌‌‌‌‌‌ కీలకం కానుంది. ప్రారంభ దశలోనే సమగ్ర వివరాలు నమోదు చేయడం ద్వారా నీటి వనరుల వినియోగాన్ని క్రమబద్ధీకరించి, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు విధానాలను ప్రోత్సహించాలన్నది వ్యవసాయ శాఖ లక్ష్యం.