వెలుగు స్పెషల్ : తగ్గుతున్న బంగారం ధరలు దేనికి సంకేతం? 

వెలుగు స్పెషల్ : తగ్గుతున్న బంగారం ధరలు దేనికి సంకేతం? 

దేశంలో సామాన్య ప్రజలకు అందనంత దూరానికి వెళ్లిన బంగారం ధరలు క్రమ క్రమంగా తగ్గుతుండటం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభంలో ఆల్ టైమ్ హై (10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,78,850)ని తాకిన బంగారం ఒక దశలో  రెండు లక్షల వైపు వెళ్ళే విధంగా కనపడింది.  దీంతో సగటు మానవుడు ఇక బంగారం కొనడం ఒక కలలాగా భావించాడనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అంతర్జాతీయ భౌగోళిక  అనిశ్చితుల  కారణంగా  కేంద్ర బ్యాంకులు పెద్ద మొత్తంలో బంగారం నిల్వలను కలిగి ఉండటం వల్ల అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగిపోయింది.  అంతేకాకుండా ద్రవ్యోల్బణంని దృష్టిలో పెట్టుకుని  అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ కమిటీ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడం, డాలర్ విలువ కూడా మార్చి నెలవరకు నియంత్రణలో ఉండటం, ఇరాన్,  ఇజ్రాయెల్,  రష్యా, ఉక్రెయిన్ లాంటి  దేశాల మధ్య  యుద్ధాలు లాంటి కారణాలు బంగారం ధరలకు ఊతమిచ్చాయని చెప్పవచ్చు.అయితే ఆగస్టు చివరి వారం నుంచి బంగారం ధరలు వెనుతిరిగాయని గణాంకాలను చూస్తే  స్పష్టంగా అర్థమౌతుంది.

 బంగారం నుంచి బాండ్‌‌‌‌‌‌‌‌ల వైపు పెట్టుబడులు

సెప్టెంబర్ మాసంలో జరిగిన ఫెడ్ సమావేశంలో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్‌‌‌‌‌‌‌‌ల మేర ఫెడ్ కమిటీ పెంచడం జరిగింది. 2023 తరువాత మొదటిసారి సెప్టెంబర్ 2026లో వడ్డీ రేట్లను (3.75%–4.00%) పెంచడంతో  పరిస్థితి పూర్తిగా మారిపోయింది.  సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగినప్పుడు మదుపుదారులను బంగారం కంటే బాండ్‌‌‌‌‌‌‌‌లు ఎక్కువగా ఆకర్షిస్తాయి. బంగారంపై ఎటువంటి రాబడి ఉండకపోవడం బాండ్‌‌‌‌‌‌‌‌లపై పెరిగిన వడ్డీ రూపంలో ఆదాయం సమకూర్చుకునే  అవకాశం ఉంటుంది. 

ఈ క్రమంలో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం నుంచి బాండ్‌‌‌‌‌‌‌‌ల వైపు మళ్లించడంతో బంగారం ధరలు బలహీనపడుతున్నాయి. ఇదే క్రమంలో యూఎస్ 10 సంవత్సరాల బాండ్ ఈల్డ్ నిరంతరం పెరగడం బంగారం ధరలపై ఒత్తిడిని పెంచుతున్నాయి.  డాలర్ విలువ కూడా పెరగటంతో ఆయా దేశాలు బంగారం కొనడం తగ్గించాయని  చెప్పవచ్చు.  అమెరికాలో  పెరుగుతున్న  ద్రవ్యోల్బణం, డిసెంబర్ నెలలో జరిగే ఫెడ్ సమావేశంలో మరోసారి వడ్డీరేట్లు మరింత పెరిగే అవకాశాన్ని సూచిస్తుంది.  ఈ రకమైన అభిప్రాయం కూడా బంగారం ధరలను కింది వైపునకు తీసుకెళుతున్నాయని అనుకోవచ్చు.  ఇప్పుడు  మనదేశంలో కూడా ఆర్బీఐ  అక్టోబర్ నెలలో  జరిగిన  ఎంపీసీ  మీటింగ్‌‌‌‌‌‌‌‌లో   రెపో రేటును 25 బేసిస్ పాయింట్‌‌‌‌‌‌‌‌లకు పెంచడం  జరిగింది.  మనదేశంలో కూడా పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  మరోసారి రెపో రేటు పెంపు ఖాయంగా కనిపిస్తుంది. 

దశలవారీగా కొనుగోలు చేయడం మంచి వ్యూహం

ఇటు బంగారం ధరలు భారీగా పతనం అవుతున్న నేపథ్యంలో కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు ధరలు ఇంకా తగ్గుతాయా, లేదా ఇక్కడి నుంచి మళ్లీ పెరుగుతాయా?.  ఇప్పుడు  బంగారం కొనాలా? ఇంకా తగ్గుతుందని ఎదురుచూడాలా? అనే ప్రశ్నలు  ఇప్పుడు అందరి మదిలో  మెదులుతున్నాయి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే బంగారం ధరలు అనేవి చాలా కారణాలచేత ప్రభావితం అవుతుంటాయి. ఏ ఒక్క అంశాన్నీ దృష్టిలో పెట్టుకొని బంగారం ధరను అంచనా వేయకూడదు.  

అయితే  బంగారం  టెక్నికల్ చార్ట్‌‌‌‌‌‌‌‌లను విశ్లేషిస్తే ఇప్పటికీ ధరలు బలహీనంగానే ఉన్నాయని చెప్పవచ్చు.  బంగారం ధరల్లో  మళ్లీ పెరుగుదల కనపడాలంటే1,40,000 –- 1,48,000 పైన కొన్ని రోజులు ట్రేడ్ కావలసి ఉంటుంది.  కిందివైపు 1,28,000 నుంచి 1,20,000 వరకు బంగారం ధరలకు మద్దతు ఉంది.  ఒకవేళ 1,20,000 దిగువకు బంగారం వెళ్లినట్లయితే సమీపకాలంలో బంగారం ధర 100000 కూడా వెళ్ళవచ్చు.  కానీ అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితుల్లో అనుకోని అనిశ్చితి (యుద్ధాలు, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభంలాంటివి) ఏర్పడితే బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చే ఆస్కారం లేకపోలేదు. అందుకే కొనుగోలుదారుల విషయానికి వస్తే అవసరం ఉన్నవారు ఒకేసారి కాకుండా,  ధర తగ్గిన ప్రతిసారి బంగారాన్ని దశలవారీగా కొనుగోలు చేయడం మంచి వ్యూహమని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ బంగారం అనేది  మదుపుదారులకు ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనంగా అభివర్ణించవచ్చు. 

- డాక్టర్. ఎండి ఖ్వాజా మొయినుద్దీన్