హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను ప్రోత్సహించేందుకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) కొత్త వన్‌డే టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ‘ఒక రోజు పోచంపల్లిలో’ పేరుతో రూపొందించిన ప్యాకేజీ ఈ నెల 22 (ఆదివారం) నుంచి ప్రారంభం కానుంది. ఈ టూర్ ధర పెద్దలకు రూ. 2,100, పిల్లలకు రూ. 1,680గా నిర్ణయించారు.ప్యాకేజీలో భాగంగా పర్యాటకులను ముందుగా హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ దర్శనానికి తీసుకెళ్తారు.
అనంతరం పోచంపల్లిలోని హరిత హోటల్‌లో స్వయం సహాయక సంఘాల మహిళలు సిద్ధం చేసిన సంప్రదాయ వంటకాలతో భోజనం ఏర్పాటు చేస్తారు. ఇక్కత్ మ్యూజియం సందర్శన ఉంటుంది.ఆసక్తి గల పర్యాటకులు https://tgtdc.in/package/pochampally వెబ్‌సైట్ ద్వారా లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800-4254-6464కు కాల్ చేసి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
