- ఆయా పల్లెల్లోని సర్కారు బడుల్లో డిజిటల్ పాఠాలు
- తొలి దశలో 3 లక్షలకనెక్షన్లకు కేంద్రం అనుమతి
- భారత్ నెట్ కిందరూ.3,189 కోట్లు మంజూరు
- రాష్ట్రంలో ప్రస్తుతం 8,966 జీపీలకు కనెక్షన్లు
- నానక్‌రామ్ గూడలో దేశంలోనే అతిపెద్ద నాక్ సెంటర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పల్లెల్లో ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు చేపట్టిన ‘టీ–ఫైబర్’ (తెలంగాణ ఫైబర్ గ్రిడ్) ప్రాజెక్టు సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతున్నది. ప్రయోగాత్మకంగా నాలుగు గ్రామాల్లో ప్రారంభించిన టీ–ఫైబర్ సేవలు సక్సెస్ కావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ సేవలు అందించేలా ప్రభుత్వం కార్యాచరణ రెడీ చేసింది.
భారత్‌నెట్ ప్రోగ్రామ్ (ఏబీపీ)లో భాగంగా రాష్ట్రంలో తొలి, రెండో విడత పనుల అప్‌గ్రెడేషన్‌తోపాటు మూడో విడత పనుల కోసం రూ.3,189 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ఈ నిధులతో రాబోయే పదేండ్ల పాటు ఎలాంటి ఆటంకం లేకుండా మెయింటెనెన్స్ చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆరు నెలల్లో 3 లక్షల కనెక్షన్ల టార్గెట్సాధించేలా టీ ఫైబర్సేవలను వేగవంతం చేసింది.
తొలి దశలో 3 లక్షల ఇండ్లకు..
రాష్ట్రవ్యాప్తంగా తొలిదశలో 3 లక్షల గృహాలకు ఇంటర్నెట్ కనెక్షన్ల లక్ష్యానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. క్షేత్రస్థాయిలో సేవలను అందించేందుకు 9 వేల మంది లోకల్ కేబుల్ ఆపరేటర్ల(ఎల్సీవో)ను నియమించారు. భారత్‌నెట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే 9,662 గ్రామాల్లో 42 వేల కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్‌సీ) ఏర్పాటు చేశారు. ఇందులో 8,966 గ్రామ పంచాయతీలకు కనెక్షన్లు పూర్తికాగా.. 8,895 గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించనున్నారు.
తాజాగా ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల పరిధిలోని మరో 3,089 గ్రామాలకు కూడా టీ-ఫైబర్ అందించేందుకు కేంద్రం అనుమతివ్వడంతో రాష్ట్రం మొత్తం ప్రభుత్వమే ఇంటర్నెట్ అందించేందుకు వెసులుబాటు కలిగింది. రూ.3,189 కోట్లలో రాష్ట్రవ్యాప్త కేబులింగ్, పదేండ్ల నిర్వహణతోపాటు ఈ మూడు జిల్లాల్లో కేబుల్ వ్యవస్థ ఏర్పాటు కోసం వినియోగించనున్నారు.
నాలుగు గ్రామాల్లో సక్సెస్..
రాష్ట్రంలోని నాలుగు గ్రామాలను పైలట్‌ప్రాజెక్టు కింద ఎంపిక చేసి టీ ఫైబర్ సేవలను అందుబాటులోకి తెచ్చారు.పెద్దపల్లి జిల్లాలోని అడవి శ్రీరాంపూర్‌తోపాటు రంగారెడ్డి జిల్లా హాజీపల్లె, నారాయణపేట జిల్లా మద్దూర్, సంగారెడ్డి జిల్లా సంగుపేట గ్రామాల్లో డిజిటల్ సేవలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవి శ్రీరాంపూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్‌తో పాఠాలు నేర్చుకుంటున్నారు.
విద్యార్థులు టీ-ఫైబర్ ఇంటర్నెట్ సహాయంతో ఏఐ రీసెర్చ్ అసిస్టెంట్‌ను ఉపయోగిస్తున్నారు. పాఠ్యపుస్తకాలకు మించిన అంశాలను తెలుసుకోవడానికి, తమ సందేహాలను తీర్చుకోవడానికి విద్యార్థులు వాయిస్ కమాండ్స్ వినియోగిస్తున్నారు. అదేవిధంగా మరో మూడు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు డిజిటల్ బోధన జరుగుతోంది.
19,345 ప్రభుత్వ ఆఫీసులకు కూడా..
రాష్ట్రంలోని 41,275 ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేటు నెట్‌వర్క్ వినియోగానికి ప్రభుత్వం ఏటా రూ.85.78 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇప్పటివరకు 19,345 ప్రభుత్వ కార్యాలయాలకు టీ-ఫైబర్ కనెక్షన్లు ఇవ్వడంతో సంస్థకు రూ.52.75 కోట్ల ఆదాయం వస్తున్నది. దీనికితోడు ప్రభుత్వానికి రూ.33 కోట్ల ఆదా అవుతోంది. గతంలో సచివాలయంలో ఇంటర్నెట్ కోసం రూ.17 కోట్లు ఖర్చు చేసేది.
టీ ఫైబర్ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత కేవలం రూ.70 లక్షలు మాత్రమే అవుతుందని టీ ఫైబర్ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రవ్యాప్త నెట్‌వర్క్ పనితీరును పర్యవేక్షించేందుకు నానక్ రామ్‌గూడలో దేశంలోనే అతిపెద్ద ఆపరేటింగ్ సర్వీసు సెంటర్ నాక్ ను ఏర్పాటు చేశారు.
కోర్ నెట్‌వర్క్‌తో అంతరాయం లేకుండా..
ఇప్పటివరకు లీనియర్ విధానం(దశలవారీగా సాగే విధానం)లో ఉన్న ఈ ప్రాజెక్టును ఇకపై కోర్ నెట్వర్క్సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు. లీనియర్ విధానంలో ఎక్కడైనా కేబుల్, సాంకేతిక సమస్యలు తలెత్తితే పరిష్కారమయ్యే వరకు ఇంటర్నెట్ నిలిచిపోయేది. కోర్ నెట్‌వర్క్‌ను సాధారణంగా ‘రింగ్’ విధానంలో నిర్మిస్తారు. అంటే ఒక దారిలో కేబుల్ తెగిపోయినా.. వెంటనే ప్రత్యామ్నాయ మార్గం ద్వారా డేటా సరఫరా జరుగుతుంది.
కాబట్టి నెట్‌వర్క్ ఆగిపోదు. గ్రామాలు, పట్టణాల్లో కనెక్షన్లు పెరిగినా వేగం తగ్గదు. మొబైల్ టవర్ల పనితీరు, వీడియో కాల్స్, క్లౌడ్ సేవలు, ఆన్‌లైన్ విద్య, టెలీమెడిసిన్ వంటి ఆలస్యం లేకుండా నడిచేందుకు కోర్ నెట్‌వర్క్ దోహదం చేస్తోందని టీ ఫైబర్ ప్రతినిధులు తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తుకు వేదిక
టీ-ఫైబర్ ద్వారా కేవలం ఇంటర్నెట్‌నే ఇవ్వడం లేదని.. గ్రామీణ విద్యార్థులు ఈ డిజిటల్ యుగంలో రాణించేందుకు అవసరమైన అవకాశాలు, వేదికను అందిస్తున్నామని టీ-ఫైబర్ ఎండీ పి.వేణుప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామం కూడా వెనుకబడిపోకుండా చూడాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమన్నారు. ఇంటర్నెట్ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలను అనుసంధానం చేసినప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చెప్పడానికి అడవి శ్రీరాంపూర్ గ్రామమే నిదర్శనమని పేర్కొన్నారు.
అంతేకాదు, వినియోగదారులకు సరసమైన ధరకే హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందిస్తామని చెప్పారు. ఇండ్లల్లో కంప్యూటర్లు, టెలివిజన్ల కోసం 4జీ, 5జీ నెట్‌వర్క్ సౌకర్యం లభిస్తుందన్నారు. ప్రతి ఇంటికి కనెక్షన్ ఇవ్వాలంటే రూ.9 నుంచి 10 వేలు ఖర్చు అవుతుందని, కేంద్రం సబ్సిడీతో ఉచితంగానే అందిస్తున్నాని పేర్కొన్నారు.
