- 22, 23 తేదీల్లో పీఏసీ మీటింగ్, మంత్రులు, డీసీసీ అధ్యక్షులతో సమావేశం
- రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, మంత్రులు, ఎమ్మెల్యేలతో సమన్వయంపై ఆరా
- మళ్లీ ఈ నెల 27న హైదరాబాద్ రాక
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్చార్జి బీఎం సందీప్ ఈ నెల 22, 23 తేదీల్లో రాష్ట్రానికి రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన వివరాలను శుక్రవారం గాంధీ భవన్ వర్గాలు మీడియాకు విడుదల చేశాయి. ఇన్చార్జి పదవిలో నియమితులైన తర్వాత ఆయన మొదటిసారి హైదరాబాద్కు వస్తుండడంతో కాంగ్రెస్ నేతలతో పాటు కేడర్లో ఆసక్తి నెలకొంది.
మీనాక్షి నటరాజన్ స్థానంలో బీఎం సందీప్ ఈ నెల 22 నుంచి రాష్ట్ర పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. ఈ నెల 22న ఉదయం గాంధీ భవన్లో జరగనున్న రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో, ఆ తర్వాత మధ్యాహ్నం జరగనున్న పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ నెల 23న ఉదయం గాంధీ భవన్లో రాష్ట్ర మంత్రులతో ఆయన విడివిడిగా సమావేశం కానున్నారు.
మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు డీసీసీ అధ్యక్షులతో పాటు పీసీసీ అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులతో వేర్వేరుగా సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, క్షేత్రస్థాయిలో నేతలు ఎదుర్కొంటున్న సమస్యలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సమన్వయంపై ఆరా తీయనున్నారు. అనంతరం ఆయన తిరిగి వెళ్లిపోయి, మళ్లీ ఈ నెల 27న హైదరాబాద్ రానున్నారు. ఆ రోజంతా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో వేర్వేరుగా సమావేశమై పార్టీ పరిస్థితులను, నేతలతో సమన్వయంపై అడిగి తెలుసుకోనున్నారు.
