- కేటీఆర్ మేనేజ్మెంట్ కోటా లీడర్
- కేసీఆర్ ప్రోత్సహించిన ఫిరాయింపులే
- ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి
- ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలనే బీఆర్ఎస్ను
- కొనసాగిస్తున్నం.. లేదంటే ఎప్పుడో ఖాళీ చేసేవాళ్లం
- అమిత్ షాకు దమ్ముంటే హైదరాబాద్‌లో
- పోటీ చేసి ఒవైసీని ఓడించాలి
- నాణేనికి రెండు ముఖాలుగా బీజేపీ, ఎంఐఎం
- నరేంద్ర మోదీ ఒక విజిటింగ్ ప్రధాన మంత్రి
- రాహుల్ ‘ఓట్ చోర్, గద్దీ చోడ్’కు దేశవ్యాప్త మద్దతు
- 16 మంది ప్రధానులు రూ.53 లక్షల కోట్లు అప్పు చేస్తే
- మోదీ ఒక్కడే రూ.125 లక్షల కోట్లు తెచ్చిండు
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో తమ అసలు రాజకీయ ప్రత్యర్థి, సమ ఉజ్జీ కేసీఆరేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో నిర్వహించిన ‘ఏబీపీ నెట్వర్క్ సదరన్ రైజింగ్ సమిట్ 2026’లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అసలైన రాజకీయ శత్రువు బీఆర్ఎస్సా లేక బీజేపీనా?’ అని ప్రశ్నించగా, ‘బీఆర్ఎస్సే" అని బదులిచ్చారు. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మీ ప్రధాన శత్రువు కాదా?" అని అడిగితే, తెలంగాణ గడ్డపై బీజేపీకి ఎలాంటి రాజకీయ అస్తిత్వం లేదన్నారు.
రాష్ట్రంలో పోరు ఎప్పుడూ ‘కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి’ మాత్రమేనని స్పష్టం చేశారు. అంతకుముందు కేటీఆర్ చేసిన ‘ఛోటా మోదీ’ విమర్శలకు స్పందిస్తూ ‘తండ్రి సంపాదించిన ఆస్తులు, ఫాంహౌస్‌ల నీడన మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన కేటీఆర్ ఒక పాసింగ్ క్లౌడ్ లాంటి వాడు.. ఆయన మాటలను తాను అసలు పరిగణనలోకి తీసుకోను’ అని సీఎం రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. ‘నేను కొట్లాడాలనుకుంటే నా సమఉజ్జీ అయిన కేసీఆర్‌తోనే కొట్లాడతాను.
ఎందుకంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, నేను పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశాను. ఆయన నిన్నటి సీఎం, నేను నేటి సీఎం. బరాబర్ సమస్థాయి వ్యక్తుల మధ్యే రాజకీయ పోరాటం ఉంటుంది తప్ప కేటీఆర్‌కు నాతో మాట్లాడే స్థాయే లేదు’ అని తేల్చిచెప్పారు. గతంలో కేసీఆర్ స్వయంగా ప్రోత్సహించిన పార్టీ ఫిరాయింపుల సంస్కృతే ఇప్పుడు ఆయన పార్టీని నిలువునా చుట్టుముట్టిందని ఎద్దేవా చేశారు. ‘రాముడి పోరాటానికి రావణాసురుడు ఎలాగైతే అవసరమో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాన్ని ఉంచడానికే తాము కేసీఆర్‌ను, బీఆర్ఎస్ను కొనసాగనిస్తున్నాం’ అన్నారు.
నా ప్రభుత్వానికి 10కి 6.5 మార్కులు..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లు పూర్తయిన వేళ పరిపాలనా పనితీరుపై మీకెన్ని మార్కులు వేసుకుంటారని, మిగిలిన రెండేండ్లలో మీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటని ప్రశ్నించగా.. సీఎం రేవంత్ రెడ్డి తన ప్రభుత్వానికి 10కి 6.5 మార్కులు (65 శాతం) ఇచ్చుకున్నారు. మిగిలిన రెండేండ్ల వ్యవధిలో వంద శాతం ఫలితాలు సాధించి రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలుపుతానన్నారు.భారత్ సమిట్ వేదికగా బీజేపీపై విమర్శలు చేసిన మీరు.. ఆ సదస్సు ముగిసిన 48 గంటల్లోనే ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.
'భారత్ సమిట్‌లో మీరేం చేస్తున్నారు?' అని మోదీ మిమ్మల్ని అడిగారా? అసలు మోదీతో మీ సంబంధాలు ఎలాంటివి? అనే ప్రశ్నలకు సీఎం బదులిచ్చారు. ''బీజేపీ ఏమైనా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్లది వాట్సాప్ యూనివర్సిటీ. బీజేపీ వాళ్లు ఏం మాట్లాడినా అది అబద్ధమే. ఎందుకంటే వాళ్లకు ఎన్నికలు గెలవడం, దేశంలో అధికారం చెలాయించడం ఒక్కటే తెలుసు. కానీ మా పని ప్రజలకు భరోసా ఇవ్వడం, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లతో కలిసి నిలబడి కొట్లాడటమే. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన రోజున ఈ దేశంలో ఉన్న ఏకైక పార్టీ మాదే. ఆ తర్వాత వచ్చిన మిగతా రాజకీయ పార్టీలన్నీ అధికారం కోసం, ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడం కోసమే పుట్టుకొచ్చాయి. రాబోయే వెయ్యేండ్లయినా కాంగ్రెస్ పార్టీ ఇక్కడే ఉంటుంది. మేం ప్రతిపక్షంలో ఉంటే ప్రజల సమస్యలపై పోరాడతాం.
రావణాసురుడికి పది తలలు ఉన్నాయని చెప్పడం ప్రతీకాత్మకమని, అంటే అతనికి పది తలలతో సమానమైన అపారమైన జ్ఞానం, తెలివితేటలు ఉన్నప్పటికీ.. స్వార్థపూరిత ఆలోచనలు, సరిదిద్దుకోలేని అహంకారం వల్లే సర్వనాశనమయ్యాడని చెప్పారు. కేసీఆర్ పరిస్థితి కూడా అచ్చం రావణాసురుడి లాంటిదేనని, తెలివితేటలు ఉన్నప్పటికీ ప్రజా వ్యతిరేక బుద్ధులు, తానే సర్వస్వం అనే విపరీతమైన గర్వంతోనే ఆయన రాజకీయంగా పతనమయ్యారని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. తనకు ఎలాంటి వారసత్వ నేపథ్యం లేదని, 2006లో స్వతంత్ర జెడ్పీటీసీగా, 2007లో స్వతంత్ర ఎమ్మెల్సీగా గెలిచి, ఆ తర్వాత రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, పీసీసీ చీఫ్‌గా ప్రజాక్షేత్రంలో కొట్లాడి 17 ఏండ్లలో సీఎం పీఠాన్ని అధిరోహించానని చెప్పారు. తన టీమ్ అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలేనని పేర్కొన్నారు.
ప్రధాని మోదీని కలిస్తే తప్పేంటి?
‘ప్రభుత్వాన్ని నడపడం కోసం నేను నరేంద్ర మోదీతో సంబంధాలు సక్రమంగానే ఉంచుకుంటాను, కేసీఆర్‌తో సహా. ఎన్నికలొచ్చినప్పుడు నేను పార్టీ వేదికపై నిలబడి కొట్లాడతాను. కానీ సీఎంగా ఉన్నప్పుడు నాకేం వ్యక్తిగత శత్రుత్వం ఉంటుంది? నాకేం లావాదేవీలు ఉంటాయి? ఈవెన్ నరేంద్ర మోదీనే.. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇచ్చిన దావత్‌కు వెళ్లొచ్చు, ఎలాంటి అధికారిక ఆహ్వానం లేకుండా, ఎవరూ పిలవకపోయినా అక్కడికి వెళ్లి పాకిస్తాన్లో బిర్యానీ తినొచ్చు. అలాంటిది నేను ఒక రాష్ట్రానికి సీఎంగా ఉండి, దేశ ప్రధానిని కలిస్తే వచ్చిన ఇబ్బందేంటి? ఎందుకు అంత ఉలిక్కిపాటు? ఇందులో ఎలాంటి రాజకీయం లేదు.
రాష్ట్ర హక్కుల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం నేను ఎవరినైనా కలుస్తాను. నేను దేశ దేశాలు తిరిగి ఇన్వె స్ట్ మెంట్ సమిట్లు పెడుతున్నాను, రోడ్‌షోలు చేస్తున్నాను. ఈసారి 'ఖేలో ఇండియా'ను తెలంగాణలో నిర్వహిస్తున్నాం. దేశం నలుమూలల నుంచి 8 వేల మంది క్రీడాకారులు మన రాష్ట్రానికి వస్తున్నారు. అందులో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది. అందుకే నేను స్వయంగా ప్రధాని మోదీ వద్దకు వెళ్లి.. 'మీరు మా రాష్ట్రానికి వచ్చి మా ప్రగతిని చూడండి. ఎల్లప్పుడూ గుజరాత్ వైపే ఎందుకు చూస్తున్నారు? గుజరాత్ కంటే ఎంతో అద్భుతంగా మేం తెలంగాణను నడుపుతున్నాం. ఒక్కసారి ఇటువైపు తిరిగి చూడండి' అని ప్రధానిని స్వయంగా ఆహ్వానించడానికి వెళ్లాను రావాలా వద్దా అనేది ఆయనే నిర్ణయించుకోవాలన్నారు.
గియాకోమో వ్యక్తిగతంగా ప్రధానిని దూషించలే..
భారత్ సమిట్ వేదికపై విదేశీ నేత గియాకోమో ఫిలిబెక్ చేసిన నినాదాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఎక్కడ అణచివేత జరిగినా సరిహద్దులు దాటి వెళ్లి చేగువేరా పోరాడారని గుర్తుచేశారు. భారత ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకుని పేదల ఓటు హక్కును లాక్కుంటుంటే అంతర్జాతీయ సమాజం చూస్తూ ఊరుకోదన్నారు. కాంగ్రెస్ పార్టీని స్థాపించిందే ఏవో హ్యూమ్ అనే విదేశీయుడని చెబుతూ, అమెరికా వెళ్లి అక్కడి న్యూయార్క్ మేయర్‌కు వ్యతిరేకంగా మాట్లాడే బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు ఇతరులను వేలెత్తి చూపే నైతిక హక్కు లేదన్నారు. సదస్సు వేదికపై గియాకోమో వ్యక్తిగతంగా ప్రధానిని దూషించలేదని, రాహుల్ గాంధీ దేశంలో ‘ఓట్ చోర్ - గద్దీ ఛోడ్’ పేరిట ప్రజల ఓటు హక్కు రక్షణ కోసం సాగిస్తున్న ప్రజా ఉద్యమానికి ప్రపంచ ప్రజాస్వామ్యవాదులంతా మద్దతు ఇవ్వాలనే కోరారని తాను స్వయంగా సాక్షినని చెప్పారు.
తెలంగాణలో బీజేపీది ప్రేక్షక పాత్రే!
తాను విద్యార్థి దశలో ఏబీవీపీ కార్యకర్తగా పనిచేసిన గతాన్ని ఎన్నడూ దాచుకోలేదని .. ఆ సిద్ధాంతాన్ని వీడి రాహుల్ గాంధీ వైపు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో సీఎం తెలిపారు. "ఈ దేశానికి నేడు నరేంద్ర మోదీ అవసరం లేదు, రాహుల్ గాంధీ నాయకత్వమే అత్యంత అవసరం". దేశాన్ని బీజేపీ చేతుల్లో వదిలేస్తే సగం మంది పేదలు ఓటు హక్కు కోల్పోతారని, వ్యాపార సంస్థలను ఈడీ, ఐటీలతో వేధించి జైళ్లకు పంపుతూ దేశ సంపద మొత్తాన్ని "హమ్ దో - హమారే దో మోదీ, అమిత్ షా, అదానీ, అంబానీ " అనే నలుగురి గుత్తాధిపత్యంలోకి నెట్టేస్తారని సీఎం హెచ్చరించారు. కరోనా వచ్చిన కొత్తలో అందరూ భయపడినా రానురాను రోగంతో సహజీవనం చేయడం నేర్చుకున్నట్లే.. పన్నెండేండ్లలో మోదీ బెదిరింపులకు ప్రజలు అలవాటుపడి భయాన్ని పూర్తిగా వీడారన్నారు.
ఇటీవల జంతర్ మంతర్ వద్ద యువత, జెన్-జీ నిరసనలతో మోదీ భయం పటాపంచలైందన్నారు. పేదలు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, మహిళలు ఓట్లేస్తే రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమని మోదీకి తెలిసిపోయిందని, అందుకే దేశాన్ని రెండుగా విభజించి సంపన్నులకే ఓటు హక్కు ఉంచి పేదల ఓటు హక్కును లాక్కోవాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుతోందన్న వాదనను కొట్టిపారేస్తూ క్షేత్రస్థాయి ఫలితాలను ఎత్తిచూపారు. ‘యాత్రికులు వస్తుంటారు, పోతుంటారు’ అన్నారు. "అమిత్ షాకు లేదా నరేంద్ర మోదీకి నిజంగా అంత దమ్ము, ధైర్యం ఉంటే.. బయట నిలబడి ఉపన్యాసాలు దంచడం మానేసి, హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో అసదుద్దీన్ ఒవైసీపై స్వయంగా పోటీ చేసి గెలవాలి. ఎందుకు పోటీ చేయరు?" అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
దేశ సంపదంతా అంబానీ, అదానీ జేబుల్లోకే..
అదానీతో పెట్టుబడులపై రేవంత్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి మోదీ అధికారంలోకి వచ్చే వరకు 60 ఏండ్ల కాలంలో 16 మంది ప్రధానులు దేశం కోసం తెచ్చిన మొత్తం అప్పు కేవలం రూ.53 లక్షల కోట్లు మాత్రమేనని వివరించారు. కానీ, 12 ఏండ్ల మోదీ ఏలుబడిలోనే బ్యాంకుల నుంచి ఏకంగా రూ.125 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ప్రజల నెత్తిన భారం మోపారని నిప్పులు చెరిగారు. "ఈ రూ.125 లక్షల కోట్లతో కొత్తగా ఏ ప్రాజెక్టు కట్టారో చూపించండి. రెండు వరుసల రోడ్డును నాలుగు వరుసలుగా మార్చడానికో, 5 వేల ఎకరాల ఎయిర్‌పోర్టుకు మరో 2 వేల ఎకరాలు జోడించడానికో రూ.125 లక్షల కోట్లు ఖర్చయ్యాయా? ఈ డబ్బంతా అదానీ, అంబానీల జేబుల్లోకే పోయింది" అని ఆరోపించారు.
ఇక రాష్ట్రంలో అదానీ వ్యాపారంపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ.. "మోదీకి, నాకు ఉన్న తేడా ఇదే. మోదీ ప్రభుత్వ సొమ్మును తీసుకెళ్లి అదానీ జేబులో పెడుతుంటే.. నేను మాత్రం అదానీ జేబులో ఉన్న పైసలను గుంజి తెచ్చి తెలంగాణలో పెట్టుబడులుగా పెట్టిస్తున్నా. మన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి, రాష్ట్ర జీఎస్డీపీ పెంచడానికి చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం ఎవరు వచ్చినా పెట్టుబడులను ఆహ్వానిస్తా" అని తెలిపారు.
త్వరలోనే రొనాల్డోను తెలంగాణకు తీసుకొస్తం
కాంగ్రెస్ సీఎంలలో, క్రీడల్లో బెస్ట్ ఎవరు? మీ ప్రేమకథ వెనుక 1,750 కిలోమీటర్ల బైక్ ప్రయాణం నిజమేనా? లక్నో బిర్యానీ గొప్పదా హైదరాబాద్ బిర్యానీ గొప్పదా? హైదరాబాద్‌లో అసద్, బీజేపీ పరస్పర విమర్శలు చేసుకుంటారు కదా.. వీరి బంధం ఏమిటి?" లాంటి ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర సమాధానాలిచ్చారు. కాంగ్రెస్ సీఎంలలో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తనకు అత్యంత ఆప్తమిత్రుడని చెప్పారు. క్రీడల్లో డిగో మారడోనా తన ఆల్-టైమ్ ఫేవరెట్ అని, ప్రస్తుత తరంలో మెస్సీ ఆటతీరు నచ్చుతుందని తెలిపారు. త్వరలోనే రొనాల్డోను కూడా తెలంగాణకు తీసుకువస్తామన్నారు.
ఉత్తరాది పెత్తనాన్ని రుద్దాలని చూస్తే తిరగబడ్తం
లోక్‌సభ స్థానాల డీలిమిటేషన్ పై సీఎం మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన సీట్లను పెంచే 50 శాతం ఫార్ములా అమలైతే కుటుంబ నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా సమాధి అవుతాయన్నారు. ప్రస్తుతం కేరళలో 20, యూపీలో 80 సీట్లు ఉండగా వ్యత్యాసం 60గా ఉందని, 50 శాతం సీట్లు పెంచితే కేరళ 30కి, యూపీ ఏకంగా 120కి చేరి వ్యత్యాసం 90కి పెరుగుతుందన్నారు. మొత్తం 850 సీట్లలో నార్త్ ఇండియాకే 650 సీట్లు వస్తే, హిందీ రాష్ట్రాల్లో మానిప్యులేషన్ చేసి గెలిచే బీజేపీకి దక్షిణాదితో పనే ఉండదని, వాజ్‌పేయి ప్రభుత్వం గతంలో ఒక్క ఓటుతో పడిపోయిన చరిత్రను గుర్తుంచుకోవాలన్నారు.
మెరిట్ ప్రాతిపదికన చూస్తే దేశ జీడీపీలో 50 శాతం ఇస్తున్న దక్షిణాదికి 50 శాతం లోక్‌సభ సీట్లు ఇస్తారా? అని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడిపెట్టకుండా ప్రస్తుతం ఉన్న 543 సీట్లలోనే 181 సీట్లను వెంటనే మహిళలకు కేటాయించవచ్చని, 2006 నాటి నిష్పత్తి ప్రకారమే రాష్ట్రాల వారీగా సీట్ల పంపిణీ ఉండాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఏపీలో మెజారిటీ ఉన్న ఆంధ్రా పాలకులు తెలంగాణను అణచివేసినట్లే, ఉత్తరాది పెత్తనాన్ని రుద్దాలని చూస్తే తీవ్ర తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
గీత కోసం బైక్‌పై ఢిల్లీ వెళ్లా..
1990వ దశకంలో ఢిల్లీలోని ప్రఖ్యాత లేడీ శ్రీరామ్ కాలేజీలో చదువుతున్న తన భార్య గీతను పెళ్లాడాలని కోరేందుకు.. ఉమ్మడి ఏపీలోని మారుమూల గ్రామం నుంచి ఢిల్లీ వరకు బైక్‌పై ఏకంగా 1,750 కిలోమీటర్లు (రానూపోనూ 3,500 కి.మీ) ప్రయాణించానని రేవంత్చెప్పారు. "అప్పుడు వేడి రక్తం.. ఆమె సెలవులకు ఇంటికి వచ్చే వరకు ఎదురుచూసే ఓపిక లేకే బైక్ వేసుకుని ఢిల్లీ వెళ్లా.. ప్రేమలో ఉన్నప్పుడు నిరీక్షణ ఎంత కష్టమో మీకు తెలీదు" అని పేర్కొన్నారు.
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన హైదరాబాదీ బిర్యానీతో దేనికీ పోలిక లేదన్నారు. చివరగా బీజేపీ- ఎంఐఎంల తెరవెనుక రాజకీయ మ్యాచ్ ఫిక్సింగ్ ఉందన్నారు. "యూపీకి వెళ్లి అసదుద్దీన్ ఒవైసీ హిందువులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారు.. దాంతో హిందూ ఓట్లన్నీ పోలరైజ్ అయి మోదీకి పడతాయి.. ఇక్కడ తెలంగాణకు వచ్చి అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని రెచ్చగొడతారు.. దాంతో ముస్లిం ఓట్లన్నీ పోలరైజ్ అయి అసదుద్దీన్‌కు పడతాయి. వారిద్దరూ ఒకే నాణేనికి రెండు ముఖాలుగా మారి పరస్పరం లబ్ధి పొందుతున్నారు తప్ప పేదరికం, నిరుద్యోగం, రోటీ -కపడా- మకాన్ గురించి మాట్లాడరు" అని విమర్శించారు.
విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేపట్టామని సీఎం రేవంత్ చెప్పారు. రాష్ట్రంలోని 27,500 ప్రభుత్వ బడుల్లో కేవలం 18.5 లక్షల మంది ఉంటే, 11 వేల ప్రైవేట్ స్కూళ్లలో 33 లక్షల మంది చదువుతున్న దుస్థితిని గమనించే ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభించా మన్నారు. 1 నుంచి 12వ తరగతి వరకు చదివే 27.5 లక్షల మంది విద్యార్థులకు క్వాలిటీ బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం కోసం ఏటా రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఫలితంగా హాజరు 50 శాతం నుంచి 90 శాతానికి పెరిగిందన్నారు.
‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని పీపీపీ పద్ధతిలో ప్రారంభించామని, పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రాను చైర్మన్‌గా నియమించామన్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి హార్వర్డ్, ఆక్స్ ఫర్డ్, ఎంఐటీ, లండన్ బిజినెస్ స్కూల్ సహా 8 అంతర్జాతీయ వర్సిటీలు హైదరాబాద్‌కు రానున్నాయని సీఎం వెల్లడించారు.
