- జీటీఏ 6.. ఒక్క రోజే రూ.20 వేల కోట్లు!..
- 13 ఏండ్ల నిరీక్షణ తర్వాత వచ్చిన గేమ్ రికార్డు
- తొలి రోజే 2.45 కోట్ల కాపీల అమ్మకం
- నోలన్ ‘ది ఒడిస్సీ’ మొత్తం వసూళ్లు ఒక్క రోజులోనే దాటేసింది
న్యూఢిల్లీ: దాదాపు 13 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మార్కెట్లోకి వచ్చిన ‘గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6’ (జీటీఏ 6) వీడియో గేమ్ రికార్డులు సృష్టిస్తోంది. గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ గేమ్, ప్రీ ఆర్డర్లు, తొలిరోజు అమ్మకాలు కలిపి 2.45 కోట్లకు (24.5 మిలియన్లు) పైగా కాపీలు అమ్ముడై, దాదాపు 2.36 బిలియన్ డాలర్ల (రూ.20 వేల కోట్లు) ఆదాయం సాధించినట్లు అనలిటిక్స్ సంస్థ ‘సెన్సార్ టవర్’ అంచనా వేసింది. ఇది ఎంటర్‌టైన్‌మెంట్ రంగ చరిత్రలోనే అతిపెద్ద లాంచ్‌గా నిలిచే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
సినిమాలను దాటేసింది
జీటీఏ 6 ఒక్క రోజు వసూళ్లు హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమాల మొత్తం కలెక్షన్లకు దగ్గరగా ఉన్నాయి. ఈ ఏడాది హాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ థియేటర్లలో పూర్తి రన్‌లో దాదాపు 2.5 బిలియన్ డాలర్లు వసూలు చేసిందని బీబీసీ పేర్కొంది. జీటీఏ 6 తొలి రోజు వసూళ్లకు దానికి స్వల్ప తేడానే ఉంది. ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ సినిమా ‘ది ఒడిస్సీ’ ప్రపంచవ్యాప్తంగా సాధించిన మొత్తం వసూళ్ల (1.80 బిలియన్ డాలర్లు)ను జీటీఏ 6 తొలి రోజే అధిగమించిందని హాలీవుడ్ రిపోర్టర్ వెల్లడించింది. భారీ బడ్జెట్ సినిమాలు నెలల తరబడి సాధించే వసూళ్లను ఈ గేమ్ 24 గంటల్లోనే దాటేయడం గేమింగ్ పరిశ్రమలో చర్చనీయాంశమైంది.
అధికారిక లెక్క రాలే
అమ్మకాల గణాంకాలపై గేమ్ తయారీ సంస్థ రాక్‌స్టార్ గేమ్స్ గానీ, దాని మాతృ సంస్థ టేక్–టూ ఇంటరాక్టివ్ గానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటివరకు వచ్చినవన్నీ మార్కెట్ అనలిటిక్స్ సంస్థలు, అంతర్జాతీయ మీడియా అంచనాలే.
