అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పింది శబరిమల దేవస్థానం.మండల పూజ కోసం వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొండపై యాత్రికుల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి, వారికి అవసరమైన సమాచారాన్ని అందించడానికి మరిన్ని సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అధికారులు.
ముఖ్యంగా అప్పం, అరవణ ప్రసాద విక్రయ కేంద్రాల దగ్గర భక్తుల రద్దీని నియంత్రించడంపై అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని వన్-వే జోన్‌గా ప్రకటించినప్పటికీ, భక్తులు రెండు వైపుల నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో అక్కడ కొత్తగా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రసాదం ఇచ్చే కౌంటర్లు, రసీదులు ఇచ్చే కౌంటర్ల మధ్య భేదాన్ని యాత్రికులు సులభంగా గుర్తించేలా ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అధికారులు.
పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ సమీపంలోని అనౌన్స్మెంట్ సెంటర్‌ను గుర్తించేందుకు కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని... అలాగే, వలియ నాడ పందల్ దగ్గర ఉన్న డిజిటల్ స్క్రీన్లపై భక్తులకు అవగాహన కల్పించేందుకు వివిధ భాషల్లో సందేశాలను ప్రదర్శించాలని నిర్ణయించారు అధికారులు.
దుకాణాలలో వస్తువుల ధరల నియంత్రణకు సంబంధించి అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. దుకాణదారులు వస్తువుల ధరల పట్టికను నాలుగు భాషల్లో భక్తులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించారు. గతంలో నిర్వహించిన తనిఖీల సమయంలో చాలామంది బోర్డులను లోపల ఉంచినట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, టెండర్లు దక్కించుకున్న దుకాణదారులు తమ పరిమితికి మించి రోడ్డుపైకి ఆక్రమణలు చేయకుండా ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు చర్యలు తీసుకోనుంది. దీనిపై బోర్డు లీజు అధికారి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తారని వెల్లడించారు.
పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా అరవణ కౌంటర్లు, అన్నదాన మండపం మార్గంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను వెంటనే తొలగించాలని యంత్రాంగం నిర్ణయించింది. సన్నిధానంలోని ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (FSTP) వద్ద అదనంగా 20 మంది కార్మికులను నియమించనున్నారు. అవసరమైతే విశుద్ధి సేన పారిశుద్ధ్య విభాగం నుంచి మరో 10 మంది సిబ్బందిని కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్లాంట్ మరో మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.
అయ్యప్ప స్వామి ఆలయంలో 41 రోజుల పాటు సాగే మండల తీర్థయాత్ర సీజన్ నవంబర్ 17న ప్రారంభమైంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని దేవస్వం బోర్డు స్పష్టం చేసింది.
