హైదరాబాద్ కొంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు ఆటోను ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం ( నవంబర్ 20 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... కొంపల్లిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురుగా ఉన్న యూటర్న్ దగ్గర కారు బీభత్సం సృష్టించిన ఈ ఘటనలో ఓ ఆటో డ్రైవర్ సహా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
మేడ్చల్ నుండి సుచిత్ర వైపు అతివేగంగా దూసుకొచ్చిన కారు బీభత్సం సృష్టించింది. కారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గరికి రాగానే ఆటోను బలంగా ఢీకొనడంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఆటోను ఢీకొన్న అనంతరం కారు అతివేగంతో ఇతర వాహనాలను ఢీకొట్టింది.
ఈ ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులను సుచిత్ర రష్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
