హైదరాబాద్ జనాలపై ‘ట్రూ అప్’ భారం.. అద్దెలకు ఉన్నోళ్లకు పరేషాన్.. ట్రూ అప్ చార్జీ అంటే ?

హైదరాబాద్ జనాలపై ‘ట్రూ అప్’ భారం.. అద్దెలకు ఉన్నోళ్లకు పరేషాన్..  ట్రూ అప్ చార్జీ అంటే ?
  • నవంబర్ నెల మాత్రం యూనిట్‌‌కు 30 పైసలు 
  • డిసెంబర్​ నుంచి యూనిట్కు రూ.50 పైసల అదనపు వసూలు..
  • విద్యుత్ శాఖకు మాత్రం  భారీగా ఆదాయం 
  • రెండేండ్లలో  రూ.1000 కోట్ల వరకు ఇన్​కం  

హైదరాబాద్ సిటీ, వెలుగు : ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులతో సతమతమవుతున్న సిటీ జనాలకు కరెంట్​ బిల్లుల్లో ట్రూ అప్ ఛార్జీలు అదనపు భారంగా మారాయి.  నవంబర్ నుంచి యూనిట్‌‌కు 30 పైసలు, డిసెంబర్ నుంచి యూనిట్‌‌కు 50 పైసల చొప్పున విద్యుత్​ శాఖ ఛార్జీలు వసూలు చేయనున్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 63.51 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 8 లక్షలకు పైగా వాణిజ్య కనెక్షన్లు. మిగతావి డొమెస్టిక్​ కనెక్షన్లు. దీంతో సాధారణంగా నెలకు 300 యూనిట్ల విద్యుత్ వినియోగించే కుటుంబం నవంబర్  లెక్క ప్రకారం అదనంగా రూ.90, యూనిట్‌‌కు 50 పైసల చొప్పున వసూలు చేసే నెలల్లో..అంటే డిసెంబర్ ​నుంచి  రూ.150 అదనంగా చెల్లించాల్సి వస్తుంది. వినియోగం పెరిగే కొద్దీ ట్రూ అప్ ఛార్జీల భారం కూడా పెరగనున్నది. ఈ ఛార్జీలతో విద్యుత్ శాఖకు భారీగా ఆదాయం సమకూరనున్నది.  

 పాత వినియోగం..కొత్త అద్దెదారులకు భారం..

ట్రూ అప్ ఛార్జీల వ్యవహారం అద్దె ఇండ్లల్లో ఉండేవారిని ఇబ్బందులకు గురి చేస్తోంది. గతంలో ఒక ఇంట్లో ఉన్నవారు వినియోగించిన విద్యుత్‌‌కు సంబంధించిన ట్రూ అప్ ఛార్జీలు, ఆ తర్వాత అదే ఇంట్లోకి కొత్తగా అద్దెకు వచ్చిన వారిపై పడుతున్నాయి. ఒక ఇంట్లో అద్దెదారులు మారినా విద్యుత్ కనెక్షన్ మాత్రం యజమాని పేరుతోనే కొనసాగుతూ ఉంటుంది. దీంతో గతంలో జరిగిన విద్యుత్ వినియోగానికి సంబంధించిన అదనపు ఛార్జీలు ప్రస్తుత బిల్లుల్లో కనిపిస్తుండటంతో కొత్తగా అద్దెకు వచ్చిన వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాము ఆ ఇంట్లో నివసించని కాలంలో గత అద్దెదారులు ఉపయోగించిన విద్యుత్‌‌కు సంబంధించిన అదనపు మొత్తాన్ని తామెందుకు చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. ఒక నెలకు సంబంధించిన అదనపు ఛార్జీలైతే భరించగలమని 24 నెలల పాటు కట్టమంటే ఎలా అని అడుగుతున్నారు. 

డొమెస్టిక్​ నుంచి విద్యుత్​ శాఖకు ఎంతొస్తది? 

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 63.51 లక్షల విద్యుత్ కనెక్షన్లలో కనీసం 20 శాతం కనెక్షన్ల నుంచి ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేసినా.. 12.70 లక్షల కనెక్షన్లు ఈ పరిధిలోకి వస్తాయి. ఉదాహరణకు ప్రతి కనెక్షన్ సగటున 300 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే, యూనిట్‌‌కు 30 పైసల చొప్పున రూ.90 అదనపు ఛార్జీ పడుతుంది. ఈ లెక్కన నెలకు సుమారు రూ.11.43 కోట్ల ఆదాయం సమకూరుతుంది. అదే వినియోగానికి యూనిట్‌‌కు డిసెంబర్ ​నుంచి 50 పైసల చొప్పున వసూలు చేస్తే ఈ మొత్తం రూ.19.05 కోట్లకు చేరుతుంది. 400 యూనిట్ల వినియోగానికి రూ.200 చొప్పున వసూలు చేస్తే రూ.25.40 కోట్లు, 500 యూనిట్ల వినియోగానికి రూ.250 చొప్పున రూ.31.75 కోట్లు వస్తాయి.   

వాణిజ్య కనెక్షన్ల నుంచి..

గ్రేటర్ పరిధిలోని 8 లక్షలకు పైగా వాణిజ్య విద్యుత్ కనెక్షన్లలో కనీసం 50 శాతం అంటే 4 లక్షల కనెక్షన్ల నుంచి ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేసినా విద్యుత్ శాఖకు రూ. కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది. ఈ కనెక్షన్లలో ఒక్కొక్కటి సగటున 300 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే నవంబర్​ నెలకు 30 పైసల చొప్పున నెలకు రూ.3.60 కోట్లు, 50 పైసల చొప్పున రూ.6 కోట్లు వస్తుంది. అదే 400 యూనిట్ల సగటు 
వినియోగానికి 30 పైసల చొప్పున రూ.4.80 కోట్లు, 50 పైసల చొప్పున రూ.8 కోట్లు, 500 యూనిట్ల వినియోగానికి రూ.6 కోట్లు, రూ.10 కోట్ల చొప్పున అదనపు ఆదాయం వస్తుంది. రెండేండ్ల పాటు ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేస్తే విద్యుత్ శాఖ ఖజానాలో  వందల కోట్లు జమ కానున్నాయి. 300 యూనిట్ల సగటు వినియోగం ఉన్న కనెక్షన్ల  నుంచి   రెండేండ్లలో రూ.591.18 కోట్లు, 400 యూనిట్లకు రూ.788.24 కోట్లు, 500 యూనిట్లకు ఏకంగా రూ.985.30 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అంటే వినియోగదారుడి స్థాయిని బట్టి రెండేళ్లలో దాదాపు రూ.600 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల వరకు టీజీఎస్పీడీసీఎల్‌‌కు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.  

ట్రూ అప్ చార్జీ అంటే..

విద్యుత్తు సరఫరా సంస్థలు (డిస్కంలు) ఏదైనా ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ కొనుగోళ్లకు చేసిన ఖర్చులు, వారికి రావాల్సిన ఆదాయం మధ్య వ్యత్యాసం ఉంటే ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు వినియోగదారుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తాయి. దీన్నే ట్రూ అప్​ఛార్జీలు అంటారు. 2022–--23 ఆర్థిక సంవత్సరంలో డిస్కంలకు నష్టం రావడంతో విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) వినియోగదారుల నుంచి 24 నెలల పాటు ఈ ఛార్జీలను వసూలు చేసుకునేందుకు అనుమతిచ్చింది. 

‘గృహజ్యోతి’కి లేదు  

2022–-23 ఆర్థిక సంవత్సరంలో గృహజ్యోతి పథకం అమలులో లేదు. అయినా, ఆ ఏడాదిలో వినియోగించిన విద్యుత్​యూనిట్లను బిల్లులో చూపినా ప్రస్తుత నెలలో 200 యూనిట్ల లోపు వినియోగించుకున్న వారికి మైనస్‌‌లోనే కరెంట్ బిల్లు వస్తుంది. దీంతో గృహజ్యోతి లబ్ధిదారులకు 200 యూనిట్ల లోపు విద్యుత్​ను వాడుకుంటే గృహజ్యోతి పథకం వర్తించి ట్రూ అప్‌‌ ఛార్జీలు పడవు. ఒకవేళ వచ్చే నెల నుంచి ఎవరైనా గృహజ్యోతి లబ్ధిదారులు 200 యూనిట్లు దాటితే ట్రూ అప్​ఛార్జీలు వేయాలా ? వద్దా అన్న అంశాన్ని పరిశీలిస్తున్నారు.