- నాలాలు, కుంటల్లోకి డ్రోన్లతో మందు పిచికారీ
- జీపీఎస్ మ్యాప్‌లో దోమలుంటే ఎరుపు.. స్ప్రే చేస్తే పచ్చ రంగు
- సక్సెస్ అయితే సిటీ అంతటా డ్రోన్ సిస్టమ్
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్‌లో దోమలపై బల్దియా అధికారులు హైటెక్ డ్రోన్లతో యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇన్నాళ్లు పంట పొలాల్లో పురుగుల మందు పిచికారి చేసేందుకు వాడిన పెద్ద సైజ్ డ్రోన్లను ఇప్పుడు స్మార్ట్ సిటీలో దోమల వేటకు ఉపయోగించనున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే అమలవుతున్న ఈ ‘డ్రోన్ వార్’ను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) ఓ ప్రైవేట్ సంస్థతో కలిసి నెల రోజుల పాటు పైలట్ ప్రాజెక్ట్‌గా వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీలో చేపట్టింది. ఇది సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో సిటీ అంతటా దోమల నివారణకు పూర్తిస్థాయి డ్రోన్ వ్యవస్థను వాడనున్నారు.
దోమలుంటే ఎరుపు.. స్ప్రే చేస్తే పచ్చ
సిటీలోని నాలాలు, మురుగు కుంటలే దోమల బెడదకు ప్రధాన కారణమని మున్సిపల్ అధికారులు గుర్తించారు. అర్బన్ మలేరియా సిబ్బంది చెరువులు, నాలాలు, కుంటల్లోకి దిగి మందు పిచికారి చేసే అవకాశం లేకపోవడంతో జీపీఎస్ ట్రాకింగ్ ఉన్న డ్రోన్ల ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న ‘మారుత్ డ్రోన్స్’ సంస్థను రంగంలోకి దించారు. వ్యవసాయంలో ఎకరాలకొద్దీ మందు పిచికారి చేసే 7 లీటర్ల సామర్థ్యం గల పెద్ద డ్రోన్లలో లార్విసైడ్ ఆయిల్ నింపి, 2 నుంచి 3 గంటల్లో దోమలు ఎక్కువగా ఉండే నాలాలు, మురుగు కుంటల్లో దాదాపు 2 కిలోమీటర్ల మేర దోమల లార్వా నివారణ మందు చల్లుతున్నారు. డ్రోన్ పిచికారి వ్యవస్థకు జీపీఎస్ అనుసంధానించడంతో నాలాలు, కుంటల్లో దోమలు ఎక్కువగా ఉన్న చోట్లు మ్యాప్‌లో ఎరుపు రంగులో కనిపిస్తాయి. డ్రోన్ మందు పిచికారి చేసిన చోట పచ్చ రంగు కనిపిస్తుంది. దీంతో సమస్య ఎంత ఉంది, పిచికారి ఎంత జరిగిందనేది ఇట్టే తెలిసిపోతుంది.
11 లక్షల జనాభా.. 183 స్లమ్‌లు
గ్రేటర్ వరంగల్ 407.71 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. 42 విలీన గ్రామాలతో కలిపి ట్రైసిటీలో 66 డివిజన్లు, 2.60 లక్షల నివాసాలు ఉన్నాయి. 92 నోటిఫైడ్, 91 నాన్ నోటిఫైడ్ కలిపి 183 స్లమ్ ఏరియాలు ఉన్నాయి. సిటీలో 11 లక్షల జనాభా ఉండగా, రోజూ మరో 10 లక్షల మంది వచ్చి వెళ్తుంటారు. స్మార్ట్ సిటీగా చెప్పుకునే ట్రైసిటీ జనాన్ని ఏండ్ల తరబడి దోమల బెడద ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
113 నాలాలు.. 1,433 కిలోమీటర్ల డ్రైనేజీ
గ్రేటర్ వరంగల్‌లో 25 ప్రధాన చెరువులు, చెరువులను తలపించే మరో 150 వరకు కుంటలు ఉన్నాయి. నయీంనగర్, బొందివాగు, భద్రకాళి, సాకరాశికుంట, చిన్న వడ్డెపల్లి, కట్టమల్లన్న వంటి 6 ప్రధాన నాలాలు, మరో 107 చిన్న నాలాలు ఉన్నాయి. 54.58 కిలోమీటర్ల ప్రధాన నాలాలు, 882.21 కిలోమీటర్ల పక్కా, 344.27 కిలోమీటర్ల కచ్చా డ్రైనేజీలు, ఇతరాలు కలిపి సిటీలో 1,433.02 కిలోమీటర్ల డ్రైనేజీ వ్యవస్థ ఉంది. ఏండ్లుగా దోమలు వీటినే ఆవాసాలుగా మార్చుకుని సిటీ జనం రక్తం తాగుతున్నాయి.
170 మంది సిబ్బంది.. రూ.కోటి ఖర్చు
జీడబ్ల్యూఎంసీలో దోమల కట్టడికి అర్బన్ మలేరియా విభాగం పనిచేస్తోంది. ఇందులో 60 మంది ఔట్సోర్సింగ్, 90 మంది డైలీ వేజ్, 20 మంది రెగ్యులర్ సిబ్బంది ఉన్నారు. సెలవులు, అనారోగ్యం పోను రోజూ 100 నుంచి 120 మంది మాత్రమే డ్యూటీలో ఉంటున్నారు; అంటే ప్రతి లక్ష జనాభాకు 10 మంది. ఏటా అక్టోబర్, నవంబర్ నెలల్లో లార్వా నివారణకు సిబ్బంది కాలనీల్లోని చిన్న డ్రైనేజీలు, మోరీల్లో మాత్రమే ఆయిల్ బాల్స్ వేసి, పంపులతో లార్విసైడ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నారు. ఇందుకోసం ఏటా రూ.కోటి ఖర్చు చేస్తున్నా గ్రేటర్ వరంగల్‌లో దోమలే రాజ్యమేలుతున్నాయి. ఈ నేపథ్యంలో హైటెక్ ‘డ్రోన్ వార్’ ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.
