మళ్లీ మొదలైన సినిమాల పైరసీ..ఒకే వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో 4 తెలుగు సినిమాలు ప్రత్యక్షం

మళ్లీ మొదలైన సినిమాల పైరసీ..ఒకే వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో 4 తెలుగు సినిమాలు ప్రత్యక్షం
  • విడుదలైన రోజే ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ‘ఆకాశంలో ఒక తార’
  • ఏపీలోని కర్నూలు థియేటర్‌‌‌‌లో 3 సినిమాల క్యామ్‌‌‌‌కార్డింగ్‌‌‌‌
  • కేసు నమోదు చేసిన టీజీ సీఎస్‌‌‌‌బీ పోలీసులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: తెలుగు సినిమాల్లో మరోసారి పైరసీ అలజడి మొదలైంది. ఒకే వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో నాలుగు కొత్త తెలుగు సినిమాలు ప్రత్యక్షం కావడంతో కలకలం రేగింది. సినిమాలను కాపీ చేసి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్ చేస్తున్న వ్యవహారంపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌‌‌‌బీ) పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.

‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యాంటీ వీడియో పైరసీ’ సెల్ ఫిర్యాదు మేరకు ఎఫ్‌‌‌‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆకాశంలో ఒక తార, రణబాలి, కల్ట్, ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 సినిమాలు విడుదలైన రోజే పైరసీ అయినట్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యాంటీ వీడియో పైరసీ సెల్‌‌‌‌ గుర్తించింది. నాలుగు వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో ఈ సినిమాలు ప్రత్యక్ష కావడంతో అప్రమత్తమైంది.

కర్నూలు థియేటర్‌‌‌‌లో రికార్డింగ్‌‌‌‌?

ఈ నెల 20న విడుదలైన ఆకాశంలో ఒక తార సినిమా పైరసీ కాపీ అదే రోజు వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్ అయినట్లు యాంటీ పైరసీ సెల్ గుర్తించింది. ఆ సమయంలో ఈ సినిమా పైరసీ కాపీ గుర్తించిన ఏకైక వెబ్‌‌‌‌సైట్ ఇదేనని ఫిర్యాదులో పేర్కొంది. ఈ కాపీ ఎక్కడి నుంచి వచ్చింది..? ఎవరు రికార్డు చేశారు..? ఎవరు అప్‌‌‌‌లోడ్ చేశారు..? అన్న వివరాలను విచారించాలని పోలీసులను కోరింది.

దీంతో పాటు రణబాలి, కల్ట్, ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 సినిమాల పైరసీ కాపీలను క్యూబ్ సినిమా టెక్నాలజీస్ సంస్థ ఫోరెన్సిక్ ద్వారా విశ్లేషించారు. ఈ మూడు సినిమాల కాపీలు ఏపీ కర్నూలులోని సిటీ స్క్వేర్ మాల్ సినిమా కాంప్లెక్స్‌‌‌‌లో క్యామ్‌‌‌‌కార్డింగ్ చేసినట్లు గుర్తించారు. దీంతో థియేటర్‌‌‌‌లో సినిమా ప్రదర్శన సమయంలోనే అక్రమంగా చిత్రీకరించి పైరసీకి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.  

సీసీ కెమెరాలు, రికార్డులను పరిశీలించండి: ఫిల్మ్ ఛాంబర్‌‌‌‌‌‌‌‌

కర్నూలు సిటీ స్క్వేర్ మాల్‌‌‌‌లోని సినిమా ప్రదర్శనలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, టికెట్ బుకింగ్ వివరాలు, ఇతర రికార్డులను పరిశీలించి పైరసీకి పాల్పడిన వారిని గుర్తించాలని ఫిల్మ్ ఛాంబర్ విజ్ఞప్తి చేసింది. పైరసీ కాపీలను తొలగించడంతో పాటు సంబంధిత వెబ్‌‌‌‌సైట్ లింకులను నిలిపివేయాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.

ఫిల్మ్ ఛాంబర్ యాంటీ వీడియో పైరసీ సెల్ ప్రాజెక్ట్ హెడ్ యర్రా మణీంద్రబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీజీసీఎస్‌‌‌‌బీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ హెడ్‌‌‌‌క్వార్టర్స్‌‌‌‌లో కేసు నమోదు చేశారు. ఐటీ చట్టం, కాపీరైట్ చట్టం, సినిమాటోగ్రఫీ చట్టం, తెలంగాణ గేమింగ్ చట్టం, బీఎన్‌‌‌‌ఎస్‌‌‌‌లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.