మంత్రి శ్రీధర్ బాబు OSD పేరుతో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని 50 లక్షల మోసం

మంత్రి శ్రీధర్ బాబు OSD పేరుతో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని 50 లక్షల మోసం

హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు OSD పేరుతో ఒక చీటర్ భారీ మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. మంత్రి శ్రీధర్ బాబు OSDని అని చెప్పుకుని, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఈ మోసగాడు 50 లక్షలు కాజేశాడు. నకిలీ OSDపై పరిశ్రమల శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది.

నిందితుడు మంత్రి ఓఎస్డీగా నకిలీ అవతారం ఎత్తి నిరుద్యోగులకు ఉద్యోగాల పేరుతో వల వేసి భారీ మోసానికి పాల్పడ్డాడు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేరు ఉపయోగించుకుని మోసాలకు పాల్పడినట్లు బాధితులు చెప్పారు. నిందితుడు కొలుగూరి రవికిరణ్‌పై పోలీసులు పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.

నకిలీ ఓఎస్డీ ఐడీ కార్డు, ప్రభుత్వ నియామక ఉత్తర్వులతో నిరుద్యోగులను చీటర్ మోసం చేశాడు. ప్రభుత్వ వెబ్‌సైట్లను పోలిన నకిలీ పోర్టల్స్ సృష్టించి అభ్యర్థులను నమ్మించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. టీచర్, మున్సిపల్ అటెండర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల పేరుతో నిందితుడు వసూళ్లకు పాల్పడ్డాడు.

నలుగురు బాధితుల నుంచి రూ.50.87 లక్షలు వసూలు చేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. మంత్రి కార్యాలయానికి బాధితులు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నకిలీ వెబ్‌సైట్లు, డిజిటల్ ఆధారాలు, బ్యాంకు లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.