వారం క్రితమే ఉద్యోగం.. అంతలోనే విషాదం.. అమెరికాలో నల్గొండ జిల్లా యువకుడు మృతి

వారం క్రితమే ఉద్యోగం.. అంతలోనే విషాదం.. అమెరికాలో నల్గొండ జిల్లా యువకుడు మృతి

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. తల్లి దండ్రుల ఆశలను నిజం చేస్తూ జాబ్ కొట్టాడు.  అమెరికాలో జాబ్ వస్తే కష్టాలన్నీ తీరుతాయని భావించిన తల్లిదండ్రులు..  ఇక అంతా ప్రశాంతం అనుకునే లోపే పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లాకు చెందిన  యువకుడు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. 

  అమెరికా న్యూయార్క్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా  మునుగోడుకు చెందిన ఈరమళ్ల సాయితేజ (25) చనిపోయాడు. 2026 నవంబర్ 19  రాత్రి న్యూయార్క్‌లో  హైవేపై వెళ్తుండగా జింకను ఢీకొని సాయితేజ కారు నిలిచిపోయింది. వెనుక నుంచి వేగంగా వచ్చిన సరకు రవాణా వ్యాన్  సాయితేజ కారును ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. 

ప్రమాదంలో కారులో ఉన్న సాయితేజ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న మరో వ్యక్తిని  న్యూయార్క్ పోలీసులు హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారు .  నిలిచిపోయిన వ్యాన్‌ను మరో రెండు వాహనాలు ఢీకొట్టడంతో వరుస ప్రమాదాలు జరిగాయి. ప్రమాదంలో మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.  

మునుగోడుకు చెందిన ప్రసాద్ , శ్రీకన్య దంపతుల పెద్ద కుమారుడు సాయితేజ. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి చదువు పూర్తవగానే ఉద్యోగం సాధించాడు. వారం రోజుల క్రితమే అమెరికాలో ఉద్యోగం సాధించిన సాయితేజ మృతి తో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.