ఖమ్మం/ దమ్మపేట, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి కీలకమైన మూడు జాతీయ రహదారుల ప్రాజెక్టులను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మూడు ప్రతిపాదనలతో లేఖలు అందజేశారు.
ఖమ్మం ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా ఎన్‌హెచ్-365ఏ, ఎన్‌హెచ్-163జి మధ్య 7 కిలోమీటర్ల మిస్సింగ్ లింక్ రోడ్డు నిర్మాణం, ఖమ్మం- దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై సర్వీస్ రోడ్ల విస్తరణ, జగ్గయ్యపేట-, బోనకల్, -వైరా, -తల్లాడ, -ఏన్కూరు, -జూలూరుపాడు, -కొత్తగూడెం మార్గాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని కోరారు.
అలాగే 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రుద్రంపూర్- – భద్రాచలం ఎన్‌హెచ్-30ను నాలుగు లేన్లుగా విస్తరించాలని, కొత్తగూడెం బైపాస్ పనులకు త్వరగా ఆమోదం తెలపాలని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో రవాణా, వ్యవసాయ, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు మరింత ఊతం లభిస్తుందని మంత్రి తెలిపారు.
సంక్రాంతి కల్లా శ్రీరాంపురం చెరువుకు గోదావరి జలాలు
దమ్మపేట మండలంలోని నాగుపల్లి సీతారామ కాలువ పెండింగ్ పనులను డిసెంబర్‌లోగా పూర్తి చేసి, వచ్చే సంక్రాంతి నాటికి శ్రీరాంపురం చెరువుకు గోదావరి జలాలను అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం గండుగులపల్లిలోని తన నివాసం నుంచి సీఈ శ్రీనివాస్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి పనుల పురోగతిని సమీక్షించారు.
ఇటీవల వర్షాలు, తుఫాను కారణంగా దెబ్బతిన్న చెరువులకు వెంటనే మరమ్మతులు చేపట్టి, ప్రతి చెరువులో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రామచంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
