ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా: మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా: మంత్రి పొన్నం ప్రభాకర్

కోహెడ, వెలుగు: గతంలో భూమి ఉన్న రైతులకు మాత్రమే బీమా సౌకర్యం ఉండేదని, ప్రజాపాలన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ పథకానికి లబ్ధిదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని, పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 12 వేల గ్రామాల్లో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

అర్హులైన కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టడంతో పాటు, కొత్తగా మంజూరైన చేయూత పింఛన్ల నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు.

అంతకుముందు కోహెడ మండల కేంద్రంలో అలింకో ఆధ్వర్యంలో వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత సహాయక పరికరాల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన శిబిరాన్ని ప్రారంభించారు. అర్హులు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ నిర్మల, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు శెట్టి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.