నవంబర్ 23న కరీంనగర్కు నితిన్ నబీన్.. లక్ష మందితో మహాపాదయాత్రకు ఏర్పాట్లు

నవంబర్ 23న కరీంనగర్కు నితిన్ నబీన్.. లక్ష మందితో మహాపాదయాత్రకు ఏర్పాట్లు

కరీంనగర్, వెలుగు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నెల 23న కరీంనగర్ కు వస్తున్నారు. 'సర్' పై విపక్షాల విమర్శల నేపథ్యంలో 'ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం– అరాచకత్వాన్ని పాతరేద్దాం' పేరిట బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్ లో నిర్వహించే మహా పాదయాత్రలో పాల్గొంటారు. సోమవారం 23న ఉదయం 11 గంటలకు నితిన్ నబీన్ హైదరాబాద్ కు వస్తారు.

అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్ కలెక్టరేట్ 'హెలిప్యాడ్' వద్దకు చేరుకుంటారు. నేరుగా కరీంనగర్ వైశ్యా భవన్ వద్దకు వెళ్లి 'మహా పాదయాత్ర'లో పాల్గొంటారు. కరీంనగర్ వైశ్యా భవన్ నుంచి టవర్ సర్కిల్, శాస్త్రీ రోడ్ మీదుగా కమాన్ దాకా ‘మహా పాదయాత్ర' కొనసాగనుంది.

నితిన్ నబిన్ తోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, పార్టీ రాష్ట్ర ఇన్​చార్జి సునీల్ బన్సల్, సహ ఇన్​చార్జిలు రేఖా శర్మ, అభయ్ పాటిల్ తదితరులు ఈ మహా పాదయాత్రలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిర్ణయించారు. అందులో భాగంగా కనీసం లక్ష మందిని సమీకరించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

'మహా పాదయాత్ర ఏర్పాట్లపై కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు సాయిని మల్లేశం, రెడ్డబోయిన గోపీ, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు తదితరులతో బండి సంజయ్ శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నితిన్ నబిన్ తొలిసారి కరీంనగర్ రానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరీంనగర్ పేరు మార్మోగేలా మహా పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.