- చందనోత్సవం పూర్తి..
- భక్తులకు నిజరూప దర్శనం ప్రారంభం
- భద్రాచలం నుంచి పట్టు వస్త్రాలు
కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన చందనోత్సవం ముగిసింది. శుక్రవారం అర్చకులు, అధికారులు భక్తులకు నిజరూప దర్శనాలను ప్రారంభించారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంజన్న నిజరూప దర్శనం మొదటగా చేసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని స్పీకర్ పేర్కొన్నారు. రాష్ట్రం కరువు బారిన పడకుండా చూడాలని, సీఎం రేవంత్ రెడ్డికి అంజన్న శక్తిని ఇవ్వాలని ప్రార్థించారు. కరువు పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఇచ్చే సూచనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.
గోదావరి తీర ఆలయాల అభివృద్ధికి నిధులు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. కొండగట్టులో స్వయంభుగా వెలిసిన ఆంజనేయస్వామి చందనోత్సవంలో పాల్గొని నిజరూప దర్శనం చేసుకోవడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి అన్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరాన ఉన్న అన్ని ఆలయాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. కొండగట్టు ఆలయానికి కూడా అధిక నిధులు కేటాయించి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు.
భద్రాచలం నుంచి పట్టు వస్త్రాలు
అంజన్న చందనోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 12 ప్రముఖ ఆలయాల నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు దేవాదాయ శాఖ తెలిపింది. శుక్రవారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం నుంచి పట్టు వస్త్రాలను తీసుకువచ్చారు. ఏఈఓ భవాని, ప్రధాన అర్చకులు రామ్ స్వరూప్ రాఘవాచార్యులు ఊరేగింపుగా వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు. కాగా, అంతకుముందు కొడిమ్యాల మండలం నాచుపల్లిలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలో స్పీకర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
మల్లన్నను దర్శించుకున్న స్పీకర్
కొమురవెల్లి : కొమురవెల్లి మల్లికార్జునస్వామిని శుక్రవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న స్పీకర్‌కు ఈవో శ్రీకాంత్ రావు, అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు స్పీకర్‌కు వేద ఆశీర్వచనం అందించి.. స్వామివారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు, స్వామి ఫొటోను అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. కొమురవెల్లి మల్లన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
