భైంసా పట్టణంలో భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

 భైంసా పట్టణంలో భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

నిర్మల్, వెలుగు: భైంసా పట్టణంలో దారుణ ఘటన జరిగింది.  విడిపోయి దూరంగా ఉంటున్న భార్యను భర్త కత్తితో పొడిచి హత్య చేశాడు. ఏఎస్పీ సాయి కిరణ్, రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ కథనం ప్రకారం..  భైంసా పట్టణానికి చెందిన వర్ష అలియాస్ ఫాతిమా (28), బీమ్ అలియాస్ షాహిద్ రెండేళ్ల క్రితం వేర్వేరు కులాలకు చెందినప్పటికీ ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంతకాలం సఖ్యతగానే ఉన్న వీరు.. ఇటీవల మతం మారినట్లు తెలిసింది. తర్వాత కుటుంబంలో విబేధాలు తలెత్తడంతో ఇద్దరూ విడాకులు (తలాక్) తీసుకున్నట్లు సమాచారం. 

వీరికి రెండు నెలల క్రితం పాప జన్మించగా, ఆ తర్వాత నుంచి ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. శుక్రవారం భైంసాలోని సేవాలాల్ చౌక్ వద్ద ఉన్న ఓ ఫంక్షన్ హాల్ వద్దకు వర్ష వచ్చినట్లు తెలుసుకున్న బీమ్.. అక్కడికి చేరుకుని తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.