మంచిర్యాల, వెలుగు: త్రివేండ్రం నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న కేరళ ఎక్స్ ప్రెస్ రైలు నుంచి జారిపడి యువతీ యువకుడు మృతి చెందారు. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదని కాగజ్ నగర్ జీఆర్పీ పోలీసులు తెలిపారు. మరణించిన వారి వయస్సు సుమారు 25 ఏళ్లు ఉంటాయన్నారు.
విషయం వెలుగులోకి వచ్చే సరికే ట్రైన్ తెలంగాణ బోర్డర్ దాటి మహారాష్ట్రలోకి ప్రవేశించడంతో అక్కడి జీఆర్పీ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. మృతదేహాలను స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో భద్రపరిచినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు.
