రాజస్థాన్ పల్లెల్లో కాంగ్రెస్ హవా.. పంచాయతీ సమితుల్లో కాంగ్రెస్కు 3,758.. బీజేపీకి 2,213

రాజస్థాన్ పల్లెల్లో  కాంగ్రెస్ హవా.. పంచాయతీ సమితుల్లో కాంగ్రెస్కు 3,758.. బీజేపీకి 2,213
  •  జిల్లా పరిషత్‌‌లో కాంగ్రెస్‌‌కు 794 .. బీజేపీకి 357
  •  నాలుగు జిల్లాల్లో కౌంటింగ్ డిసెంబర్ 17కు వాయిదా
  •  పట్టణాల్లో బీజేపీ పైచేయి.. పల్లెల్లో కాంగ్రెస్ జోరు 
  •  పంచాయతీ సమితుల్లో కాంగ్రెస్‌‌‌‌కు 3,758.. బీజేపీకి 2,213
  •  నాలుగు జిల్లాల్లో కౌంటింగ్ వాయిదా
  •  పట్టణాల్లో బీజేపీ, పల్లెల్లో కాంగ్రెస్ జోరు

జైపూర్: రాజస్థాన్‌లో జరిగిన జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ అధికార బీజేపీపై భారీ ఆధిక్యం సాధించింది. శుక్రవారం సాయంత్రం వరకు ఫలితాలు వెల్లడైన 7,520 పంచాయతీ సమితి స్థానాల్లో కాంగ్రెస్ 3,758, బీజేపీ 2,213 గెలుచుకున్నాయి. ఫలితాలు వచ్చిన 1271 జిల్లా పరిషత్ స్థానాల్లో కాంగ్రెస్ 794, బీజేపీ 357 దక్కించుకున్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 37 జిల్లాల్లో 1,275 జిల్లా పరిషత్ వార్డులు, 7,543 పంచాయతీ సమితి వార్డులకు ఎన్నికలు జరిగాయి. అక్టోబర్ 22, 28, నవంబర్ 3, 14 తేదీల్లో నాలుగు దశల్లో జరిగిన ఈ ఎన్నికల్లో 41,480 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 2.48 కోట్ల మంది ఓటేశారు.

నాలుగు జిల్లాల్లో కౌంటింగ్ వాయిదా

కోట, బారాన్, కరౌలి, శ్రీగంగానగర్ జిల్లాల్లో ఓట్ల లెక్కింపును డిసెంబర్ 17కు వాయిదా వేశారు. ఈ జిల్లాల్లో ప్రస్తుత స్థానిక సంస్థల ఐదేండ్ల పదవీకాలం డిసెంబర్‌‌‌‌లో ముగియనుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నాలుగు జిల్లాల్లో 128 జిల్లా పరిషత్ వార్డులు, 702 పంచాయతీ సమితి వార్డులకు 3,227 మంది పోటీ చేయగా, 24.51 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి.

పట్టణాల్లో బీజేపీ.. పల్లెల్లో కాంగ్రెస్

సెప్టెంబర్‌‌‌‌లో జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ 4,179 వార్డులు గెలుచుకోగా, కాంగ్రెస్ 3,613 వార్డులకు పరిమితమైంది. అయితే అప్పుడు కూడా మాజీ సీఎం వసుంధర రాజే కంచుకోట ఝాలావాడ్ మున్సిపల్ కౌన్సిల్‌‌‌‌ను, బికనీర్ మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఆ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,273 వార్డుల్లో స్వతంత్రులు గెలిచారు. సీఎం భజన్‌‌‌‌లాల్ శర్మ సొంత జిల్లా భరత్‌‌‌‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌లో 65 వార్డులకు 36 స్వతంత్రులే గెలుచుకున్నారు. తాజా గ్రామీణ ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుంది.