- అమెరికా, ఇరాన్‌తో పాక్ చర్చలు జరుపుతుంటే మనం చూస్తూ ఉండిపోయినం
- మోదీ ‘ఫ్రెండ్షిప్’తో దేశానికి ఉపయోగమేంటి?
- కాంగ్రెస్ ఉంటే జీ3 టేబుల్ దగ్గర మన పీఎం ఉండేవారు
- టెర్రరిజం ఆగేదాకా పాక్‌తో చర్చల్లేవ్
- రాహుల్ ‘పాక్ ఫ్యాన్ బాయ్’: బీజేపీ ఫైర్
షికాగో, న్యూఢిల్లీ: అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ ఇప్పుడు ‘సైడ్ ప్లేయర్’గా మారిపోయిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ పాత్ర ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడుతూ రాహుల్‌ను ‘పాక్ ఫ్యాన్ బాయ్’ అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.
పాకిస్తాన్ అమెరికా, ఇరాన్‌లతో చురుగ్గా చర్చలు జరుపుతుండగా భారత్ మాత్రం కేవలం చూస్తూ ఉండిపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని రాహుల్ అన్నారు. ప్రపంచ నేతల మధ్య వ్యక్తిగత స్నేహాల ఆధారంగా విదేశాంగ విధానం నడవదని, ‘‘ప్రధాని మోదీ ఎప్పుడూ ‘ఆయన నా స్నేహితుడు’ అంటారు. కానీ జియోపాలిటిక్స్ అలా పనిచేయవు. ఆయన స్నేహంతో ఉపయోగమేంటి?’’ అని ప్రశ్నించారు.
- ఆ టేబుల్ వద్ద భారత ప్రధాని ఉండేవారు
చైనాలోని షెన్జెన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన త్రైపాక్షిక (జీ3) భేటీపైనా రాహుల్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ముగ్గురు నేతల ఫోటోను పంచుకుంటూ, ‘కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే, ఈ టేబుల్ వద్ద భారత ప్రధానమంత్రి కూర్చుని ఉండేవారు. రాజీపడిన ప్రధాని ఎప్పటికీ ఈ టేబుల్ వద్ద కూర్చోలేరు’ అని విమర్శించారు. నవంబర్ 19 న షెన్జెన్లోని ఒక విల్లాలో ‘అపెక్’ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ఈ ముగ్గురు నేతలు సమావేశమై ‘శాంతి దిశగా రష్యా-చైనా-అమెరికా దేశాధినేతల ప్రకటన’ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
టెర్రరిజం ఆగేదాకా చర్చల్లేవ్
భారత్ పాక్ సరిహద్దుల్లో ఉగ్రవాదం ఆగితేనే పాకిస్తాన్‌తో చర్చలు సాధ్యమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈమేరకు షికాగోలో ఒక పాకిస్తానీ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. అమాయకుల ప్రాణాలు తీస్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు చర్చలు జరపడం అసాధ్యమని, దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మరోవైపు, ఫిక్కీ వార్షిక సమావేశంలో పారిశ్రామికవేత్తలపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలనూ రాహుల్ తప్పుబట్టారు.
పన్ను రాయితీలు ఇచ్చినా వేతనాలు పెంచలేదని, ఉద్యోగాలు కల్పించలేదని మోదీ విమర్శించగా.. అది ఇండస్ట్రీ లీడర్లపై ఆరోపణ కాదు, సొంత ఆర్థిక వైఫల్యాన్ని మోదీ స్వయంగా ఒప్పుకోవడమేనని రాహుల్ కౌంటర్ ఇచ్చారు. కాగా, రాహుల్ విదేశాంగ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ప్రదీప్ భండారీ, సీఆర్ కేశవన్ తదితరులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విదేశీ వేదికలపై రాహుల్ పాకిస్తాన్‌ను ఆదర్శంగా చూపుతూ ‘పాక్ ఫ్యాన్ బాయ్’లా వ్యవహరిస్తున్నారని, రష్యా-ఉక్రెయిన్ వంటి సంక్షోభాల్లో భారత్ పోషిస్తున్న పాత్రను విస్మరించి దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు.
