ఢిల్లీలో SCO సదస్సుకు పాక్ మంత్రి.. కేంద్రంపై విపక్షాల ఫైర్ 

ఢిల్లీలో SCO సదస్సుకు పాక్ మంత్రి.. కేంద్రంపై విపక్షాల ఫైర్ 
  • చర్చలు, టెర్రరిజం కలిసి సాగవన్నారు కదా.. మరిదేంటి? అని నిలదీత 

న్యూఢిల్లీ: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీవో) సివిలైజేషనల్ డైలాగ్ ఫోరమ్ సమావేశాలకు పాకిస్తాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ హాజరుకావడం వివాదానికి దారితీసింది. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు మాలిక్ శుక్రవారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ఆయన రాకతో కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. చర్చలు, టెర్రరిజం కలిసి ముందుకు సాగలేవని బీజేపీ పదేపదే చెబుతుందని.. మరిప్పుడు పాకిస్తానీ మంత్రి భారత్‌‌‌‌కు రావడాన్ని పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానంలో అయోమయం కనిపిస్తోందని సమాజ్‌‌‌‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత ఫక్రుల్ హసన్ చాంద్  విమర్శించారు. 

కేంద్రం తన విదేశాంగ విధానంలో రాజీ పడుతోందని కాంగ్రెస్ నేత సురేంద్ర రాజ్‌‌‌‌పుత్ ఆరోపించారు. పాకిస్తాన్‌‌‌‌తో క్రికెట్ ఆడబోమని చెబుతూనే.. ఇప్పుడు ఆ దేశ మంత్రినే భారత్‌‌‌‌కు రానివ్వడం ద్వంద్వ వైఖరి అని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడితో పనిచేస్తున్నారని సురేంద్ర విమర్శించారు. కేంద్రంలోని అధికార పార్టీకి ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయని, తమకు నచ్చినట్టు విదేశాంగ విధానాన్ని మార్చుకుంటోందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్‌‌‌‌పీ) నేత క్లైడ్ క్రాస్టో విమర్శించారు. 

‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో మాలిక్ ఓ మంత్రిలా కాకుండా ఉగ్రవాదిలా మాట్లాడాడని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ గుర్తుచేశారు. ‘ఆపరేషన్ సిందూర్’ టైంలో మాలిక్ మాట్లాడుతూ.. మా నీటి విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే చేతులు నరికేస్తామని హెచ్చరించారు. 1960 నాటి ఒప్పందాన్ని గౌరవించాలని డిమాండ్ చేశారు.

ఇతర ప్రాంతాలకు వెళ్లొద్దు

భారత్ పర్యటనకు వచ్చిన పాకిస్తాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ ఆగ్రాలోని తాజ్ మహల్‌‌‌‌తో పాటు ఢిల్లీలోని నిజాముద్దీన్ దర్గాను సందర్శించేందుకు కేంద్రాన్ని అనుమతి కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే, మాలిక్ రిక్వెస్ట్ ను కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. మాలిక్ కేవలం ఎస్‌‌‌‌సీఓ కార్యక్రమంలో మాత్రమే పాల్గొనాలని, ఇతర ప్రాంతాలకు వెళ్లకూడదని స్పష్టం చేసింది.