తిరుప్పరంకుండ్రం కొండపై.. కార్తీక దీపానికి సుప్రీం ఓకే 

తిరుప్పరంకుండ్రం కొండపై.. కార్తీక దీపానికి సుప్రీం ఓకే 
  • తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించండి
  • అనుమతి ఈ ఒక్కసారికేనన్న సుప్రీంకోర్టు 

న్యూఢిల్లీ: తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై నవంబర్ 24న కార్తీక దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతినిచ్చింది. అయితే, ఈ వెసులుబాటును కేవలం ఈ ఒక్కసారికి మాత్రమే పరిమితం చేస్తూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం.పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీపం వెలిగించేందుకు కేవలం దేవస్థానం తరఫున అధికారం పొందిన వ్యక్తులు, ప్రభుత్వ అధికారులకు మాత్రమే అనుమతి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అవసరమైతే అక్కడ తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ కొండపై సంప్రదాయ కార్తీక దీపాన్ని వెలిగించేందుకు అనుమతిస్తూ గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే విధించింది.

మధురైలోని అరుళ్మిగు సుబ్రమణ్యస్వామి ఆలయానికి చెందిన ఈ కొండపై కార్తీక దీపాన్ని ఎక్కడ, ఎవరు వెలిగించాలనే అంశంపై కొంతకాలంగా వివాదం నెలకొంది. దశాబ్దాలుగా కొండ దిగువ భాగంలోని ఉచ్చిపిళ్లయార్ ఆలయానికి సమీపంలో ఉన్న దీప మండపం వద్ద ఈ దీపాన్ని వెలిగిస్తున్నారు. అయితే, కొండపై భాగంలో ఉన్న హజ్రత్ సుల్తాన్ సికందర్ బాదుషా ఔలియా దర్గాకు సుమారు 50 మీటర్ల దూరంలో ఉన్న పురాతన రాతి దీప స్తంభం వద్ద దీపం వెలిగించేందుకు అనుమతించాలని హిందూ సంఘాలు కోరుతున్నాయి. దర్గాకు సమీపంలో ఉన్న రాతి స్తంభంపై సంప్రదాయ కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతినిస్తే, దేశవ్యాప్తంగా ఉన్న వేలాది సర్వే స్తంభాలకు మతపరమైన గుర్తింపు వచ్చే ప్రమాదం ఉందని తమిళనాడు ప్రభుత్వం వాదించింది.