బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నుంచి రాబోతున్న సినిమా ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’. చిత్రాంగద సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని అపూర్వ లఖియా తెరకెక్కించారు. 2020లో భారత్ - చైనా మధ్య గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ప్రమోషన్స్‌లో భాగంగా సల్మాన్ ఖాన్, చిత్రాంగద శుక్రవారం హైదరాబాద్ వచ్చారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో తమ సక్సెస్‌ను మీడియాతో షేర్ చేసుకున్నారు.
తన సినిమాలకు హైదరాబాద్‌లో ఉండే క్రేజ్ గురించి మాట్లాడిన సల్మాన్.. ఇక్కడి ప్రేక్షకులు తన సినిమాలు ఎప్పుడు వచ్చినా ఓ పండుగలా సెలబ్రేట్ చేస్తారని చెప్పారు. ప్రచారంలో ఉన్నట్టుగా ఇది కల్నల్ సంతోష్ బాబు జీవిత కథ కాదని, సైనిక కుటుంబాల మానసిక సంఘర్షణ ఇందులో కీలకమని, ఆ నేపథ్యంలోనే సినిమా ఉంటుందని సల్మాన్ స్పష్టం చేశారు. ఈ తరహా సినిమాల విషయంలో ఫిజికల్ ఛాలెంజెస్ అనేవి ఎప్పుడూ ఉంటాయని, ఈ సినిమా కోసం మైనస్ డిగ్రీల చలిలో పనిచేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు.
ట్రైలర్‌లో ఏఐ విజువల్స్ వాడారనే విమర్శలను తోసిపుచ్చిన సల్మాన్.. ఆ విమర్శలను పట్టించుకునే పరిస్థితిలో టీమ్ ఎవరూ లేరని, తాము రియల్ లొకేషన్స్‌లో తీశామని చెప్పారు. ఇక టాలీవుడ్ హీరోలతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, చిరంజీవి, రామ్ చరణ్, వెంకటేష్, మహేష్ బాబు సహా ఏ హీరో సినిమాలో నటించమని అడిగినా వెంటనే నటిస్తానని సల్మాన్ చెప్పుకొచ్చారు. తెలుగులో తనకు నచ్చిన కథానాయకుడిగా తానే ఉండాలని కోరుకుంటానని ఆయన సరదాగా చెప్పారు. ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో ఎదుర్కొన్న సవాళ్ల గురించి, ఇందులోని తమ క్యారెక్టరైజేషన్స్ గురించి చిత్రాంగద తెలియజేసింది.
